గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 02:06:52

ఘర్‌వాపసీ

ఘర్‌వాపసీ
  • బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
  • కుటుంబంలోకి రావడం వంటిదేనన్న జేపీ నడ్డా
  • వెంటనే రాజ్యసభ సీటు ఖరారు
  • బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ క్యాంప్‌లు
  • 95 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌
  • కాంగ్రెస్‌లో ఎంతో వేదన అనుభవించా: సింధియా
  • అత్యాశతోనే పార్టీని వీడారు: దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ/భోపాల్‌, మార్చి 11: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. బుధవారం బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు రాజ్యసభ సీటు ఖరారైంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ క్యాంప్‌లు మొదలుపెట్టాయి. బీజేపీ హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ఓ విలాసవంతమైన హోటల్‌కు తమ ఎమ్మెల్యేలను తరలించింది. కాంగ్రెస్‌ పార్టీ 95 మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని జైపూర్‌కు పంపించింది. ఇందులో 92 మంది కాంగ్రెస్‌ సభ్యులు కాగా, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. వారికి రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌, ఇతర సీనియర్‌ నేతలు ఆహ్వానం పలికారు. వారిని బ్యూనా విస్టా రిసార్ట్‌కు తరలించినట్టు సమాచారం. గతంలో మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య రాజకీ సంక్షోభం తలెత్తినప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇదే రిసార్ట్‌కు తరలించారు. 


వాస్తవ దూరంగా కాంగ్రెస్‌: సింధియా 

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి జ్యోతిరాదిత్య సింధియాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. జ్యోతిరాదిత్య నానమ్మ విజయరాజె సింధియా బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరని గుర్తుచేశారు. సింధియా కుటుంబంలోని మిగతావారంతా బీజేపీలో ఉన్నారని చెప్పారు. కాబట్టి జ్యోతిరాదిత్య తన కుటుంబంలోకి వస్తున్నట్టేనని చెప్పారు. సింధియా మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబంలోకి ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవచేసే వేదికను కల్పించారని కొనియాడారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో వేదన అనుభవించానని, ఒత్తిడికి గురయ్యానని చెప్పా రు. దీంతో ప్రజలకు సేవచేసే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. కాంగ్రెస్‌ ఒకప్పటిలా లేదని, వాస్తవదూరంగా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. దీంతో ప్రతిచోటా ప్రజలు ఆ పార్టీని తిరస్కరిస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌ తన హృదయంలో ఒక భాగమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం గురించి తాను కన్న కలలన్నీ గత 18 నెలల కాలంలో కల్లలుగానే మిగిలిపోయాయని చెప్పారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడని, ఆయన చేతుల్లో దేశభవిష్యత్తు భద్రంగా ఉంటుందని కొనియాడారు. జ్యోతిరాదిత్య బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు రాజ్యసభ సీటు ఖరారైంది. ఆయనకు మధ్యప్రదేశ్‌ నుంచి టికెట్‌ కేటాయిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నది. 


కొడుకులాంటోడు మోసంచేశాడు: దిగ్విజయ్‌ 

జ్యోతిరాదిత్య సింధియా తన కొడుకులాంటివాడని, తనను మోసం చేశాడని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని సింధియాకు ఆఫర్‌ ఇచ్చాం. అయితే తన అనుచరుడిని కూర్చోబెట్టాలని సింధియా పట్టుబట్టారు. దీంతో అనర్హులకు పదవి ఇచ్చేదిలేదంటూ కమల్‌నాథ్‌ తిరస్కరించారు’ అని పేర్కొన్నారు. సింధియా వర్గానికి చెందిన ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. సింధియాకు పార్టీ ఎంతో ఇచ్చిందని, అయినా ఆయన అత్యాశతో బీజేపీలో చేరారని విమర్శించారు. ‘ఆయనను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపగలుగుతాం. కానీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేం కదా. మోదీ, షా మాత్రమే ఆ పని చేయగలరు’ అని ఎద్దేవా చేశారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. సింధియా వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా లేరని దిగ్విజయ్‌ చెప్పారు. జ్యోతిరాదిత్యకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చేలా ఒత్తిడితెచ్చేందుకే వారు బెంగళూరుకు వెళ్లారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోనే ఇదంతా జరుగుతున్నదని విమర్శించారు. రెబల్‌ క్యాంప్‌లోని ఎమ్మెల్యేల ఫోన్లను గుంజుకున్నారని, కనీసం వారిని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వడం లేదని, ఒకవేళ మాట్లాడినా రికార్డు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు.


‘మోదీజీ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడంలో మీరు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 35 శాతం తగ్గిన విషయాన్ని మీరు గుర్తించినట్టు లేరు. దయచేసి ఆ ప్రయోజనాలను భారతీయులకు అందించండి. పెట్రోల్‌ ధరను లీటర్‌కు రూ.60 దిగువకు తగ్గించండి. ఆర్థికరంగానికి ఊతమివ్వండి’ 

- కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ 


లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సింధియా.. త్వరగా రాజకీయ పునరావాసాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుగానే సింధియాతో చర్చించి కొత్త బాధ్యతలు అప్పగించిఉంటే బాగుండేది. అయినా.. మధ్యప్రదేశ్‌లో అద్భుతం జరుగొచ్చు. సీఎం కమల్‌నాథ్‌ శక్తిసామర్థ్యాలపై కాంగ్రెస్‌ నేతలకు నమ్మకం ఉన్నది. మధ్యప్రదేశ్‌ వంటి పరిస్థితి మహరాష్ట్రలో లేదు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభు త్వం చక్కగా పనిచేస్తున్నది. 

- శరద్‌పవార్‌, ఎన్సీపీ అధినేత 


logo