సోమవారం 13 జూలై 2020
National - Jan 20, 2020 , 03:26:11

నడ్డాకే బీజేపీ పగ్గాలు!

నడ్డాకే బీజేపీ పగ్గాలు!
  • నేడు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న పార్టీ సీనియర్‌ నేతలు

న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత జగత్‌ప్రకాశ్‌ నడ్డా ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. ప్రస్తుతం ఆయన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరుగనున్న ఓ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు మచ్చలేని నేతగా ఆ పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, హోంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా భావించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనైట్టెంది. బీజేపీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక కోసం నామినేషన్‌ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రాధా మోహన్‌ సింగ్‌ ఆదివారం తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం పోటీ నెలకొనే పరిస్థితి ఎదురైతే, ఆ మరుసటి రోజు(మంగళవారం) ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా గత ఐదున్నరేండ్లుగా అమిత్‌ షా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు హోంశాఖ దక్కింది. ‘ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్‌ షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవడం అనివార్యమైంది. దీంతో పార్టీకి ఎంతోకాలంగా విధేయుడిగా ఉన్న నడ్డాను ఆ పదవికి ఎంపిక చేయనున్నారు.


logo