ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 01:19:54

30 మంది పోతే కష్టమే

30 మంది పోతే కష్టమే

  • రాజస్థాన్‌ స్పీకర్‌తో సీఎం గెహ్లాట్‌ కుమారుడి వీడియో సంభాషణ వైరల్‌ 
  • స్పీకర్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌ l జైసల్మేర్‌కు సీఎం క్యాంపు ఎమ్మెల్యేలు

జైపూర్‌/జైసల్మేర్‌, జూలై 31: రాజస్థాన్‌ రాజకీయ నాటకంలో శుక్రవారం మరో పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీతో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ వీడియో సంభాషణ రికార్డులు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వైపు 30 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రభుత్వాన్ని కాపాడటం కష్టమని జోషి చెప్పటం దుమారం రేపుతున్నది. ‘30మంది వెళ్లిపోతే మీరు చేసేదేమీ ఉండదు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడతారు’ అని స్పీకర్‌ జోషి వైభవ్‌కు చెప్పారు. బుధవారం జోషి జన్మదినం సందర్భంగా ఆయనను వైభవ్‌ కలిసిన సమయంలో ఈ సంభాషణ జరిగింది. ఈ రికార్డులపై బీజేపీ మండిపడింది. స్పీకర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌పూనియా డిమాండ్‌ చేశారు.

జైసల్మేర్‌కు రాజకీయం 

రాజస్థాన్‌ రాజకీయం జైపూర్‌నుంచి శుక్రవారం జైసల్మేర్‌కు మారింది. సంక్షోభం మొదలైన నాటినుంచి జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్‌ హోటల్‌లో మకాం వేసిన సీఎం అశోక్‌గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్‌కు మకాం మార్చారు. ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆ లోపు ఒక్క ఎమ్మెల్యే కూడా తన క్యాంపు నుంచి జారిపోకుండా చూసుకొనేందుకు సీఎం ఈ ఎత్తుగడ వేసినట్టు భావిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రానున్నారు. కాగా, తిరుగుబాటు నేత సచిన్‌పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు మకాం వేసిన హర్యానాలోని గుర్‌గ్రాం, మనేసర్‌ హోటళ్లలోకి రాజస్థాన్‌ అవినీతి నిరోధకశాఖ పోలీసులను స్థానిక పోలీసులు వెళ్లనివ్వలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్రసింగ్‌లకు నోటీసులు ఇవ్వటానికి వెళ్లగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవటంపై బీజేపీ చేస్తున్న విమర్శలను సీఎం గెహ్లాట్‌ తిప్పికొట్టారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని ప్రశ్నించారు. 


logo