ఆదివారం 05 జూలై 2020
National - Jun 03, 2020 , 06:52:55

సగం కాలిన మృతదేహంతో మరో శ్మశాన వాటికకు..

సగం కాలిన మృతదేహంతో మరో శ్మశాన వాటికకు..

శ్రీనగర్‌ : కరోనా వైరస్‌తో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలను కొంతమంది అడ్డుకున్నారు. సగం కాలిన మృతదేహాన్ని శ్మశానవాటిక నుంచి తీసుకెళ్లిన వైనం ఇది. ఉన్నతాధికారుల చొరవతో వేరే శ్మశాన వాటికలో మరోసారి ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన జమ్మూ రీజియన్‌లోని దొడ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

దొడ జిల్లాకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చనిపోయాడు. ఆ వృద్ధుడికి అంత్యక్రియలు చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. అంత్యక్రియలకు ఉన్నతాధికారుల నుంచి కుటుంబ సభ్యులు అనుమతి పొందారు. దీంతో దోమన ఏరియాలోని శ్మశాన వాటికలో రెవెన్యూ అధికారులు, వైద్య బృందం ఆధ్వర్యంలో వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

విషయం తెలుసుకున్న దోమన ప్రజలు.. శ్మశాన వాటిక వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అంత్యక్రియలను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అధికారులపై రాళ్ల దాడి చేశారు. తీవ్ర భయాందోళనలకు గురైన వారు.. సగం కాలిన మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని జీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భగవతి నగర్‌ శ్మశాన వాటికలో ఆ మృతదేహానికి మరోసారి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌, సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మృతుడి కుమారుడు మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నాన్న అంత్యక్రియలను నిర్వహిస్తామని అధికారుల నుంచి అనుమతి పొందామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేవలం తనతో పాటు అమ్మ, సోదరుడు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. సగం కాలిన మృతదేహాన్ని వేరే దగ్గరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం బాధాకరమైన విషయమన్నారు. కొవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు. logo