గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 18:07:00

జార్ఖండ్‌లో 94 ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లు

జార్ఖండ్‌లో 94 ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లు


రాంచీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి  సొంతూళ్లకు వస్తున్న వలస కార్మికులకు అండగా నిలిచేందుకు జార్ఖండ్ ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల వెంబడి దాదాపు 94 ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటుచేసి వలసకార్మికులకు ఆహారం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. హైవేపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటుచేసిన అటుగా వెళ్లే కార్మికులకు భోజనం అందించనున్నట్లు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ చెప్పారు. ప్రస్తుతం 94 ప్రాంతాలను గుర్తించామని, అవసరమైతే మరిన్ని ఏర్పాటుచేసేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 6,432 దీదీ కిచెన్లను ఏర్పాటుచేసి రెండు పూటలా దాదాపు 45 వేల మంది నిరుపేదల కడుపు నింపుతున్నామన్నారు. తమ రాష్ట్రానికి చెందినవారికే కాకుండా ఇతర రాష్ట్రాల పేదలకు కూడా ఆహారం అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల మంది వలస కార్మికులకు ఆహారాన్ని అందించే పనులు చేపట్టినట్లు హేమంత్‌ సోరేన్‌ వెల్లడించారు. జాతీయ రహదారుల వెంట నడుస్తూ వెళ్తున్న వలస కార్మికులకు ఇప్పటికే జార్ఖండ్‌ పోలీసులు ఆహార పొట్లాలు అందిస్తూ.. వారికి రాత్రివేళలో క్షేమంగా ఉండే ప్రాంతాలను చూపిస్తున్నారు. 


logo