సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 21:51:06

సీబీఐకి దర్యాప్తు సమ్మతిని వెనక్కి తీసుకున్న జార్ఖండ్‌

సీబీఐకి దర్యాప్తు సమ్మతిని వెనక్కి తీసుకున్న జార్ఖండ్‌

రాంచి: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు దర్యాప్తు కోసం ఇప్పటి వరకు అమలులో ఉన్న సాధారణ సమ్మతిని జార్ఖండ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర పరిధిలో జరిపే దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ పొందాల్సి ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ఢిల్లీ ప్రత్యేక పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కిందకు వస్తుంది. దీని ప్రకారం ప్రజల భద్రత, పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కిందకు వస్తాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని తెలియజేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేకుండా సీబీఐ దర్యాప్తులు చేపట్టేది. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదన్న బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  2018లో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలు సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి. అయితే 2019లో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. మరోవైపు 2019 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌, ఈ ఏడాది జూలైలో రాజస్థాన్‌, గత నెలలో మహారాష్ట్ర, బుధవారం కేరళ ప్రభుత్వం సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకోగా తాజాగా జార్ఖండ్‌ కూడా ఈ రాష్ట్రాల సరసన చేరింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.