ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 14:11:03

లాలూ ఆశ‌ల‌పై జార్ఖండ్ హైకోర్టు నీళ్లు..

లాలూ ఆశ‌ల‌పై జార్ఖండ్ హైకోర్టు నీళ్లు..

న్యూఢిల్లీ: క‌నీసం బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌నాటికైనా జైలు నుంచి బ‌య‌టికి రావాల‌న్న లాలూ ఆశ‌ల‌పై జార్ఖండ్ హైకోర్టు నీళ్లు చ‌ల్లింది. దుమ్కా ఖ‌జానా కేసులో బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈనెల 27కు వాయిదావేసింది. బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప‌లు కేసుల్లో జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. అందులో ఒక‌టైన దుమ్కా ఖ‌జానా కుంభ‌‌కోణం కేసులో జైలు శిక్షప‌డి న‌వంబ‌ర్ 9 నాటికి స‌గం రోజులు పూర్తికానున్నాయి. అదే రోజున ఈ కేసులో బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ ఉండ‌గా, దానిని జార్ఖండ్ హైకోర్టు న‌వంబ‌ర్ 27కు వాయిదా వేసింది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజున పార్టీ అధినేత ఇంటికి చేరుతార‌ని ఆర్జేడీ పార్టీ శ్రేణులు పెట్టుకున్న ఆశ‌లు ఆవిర‌య్యాయి. 

ప్ర‌స్తుతం బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రేపు మూడో ద‌శ పోలింగ్ జ‌రుగ‌నుంది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు న‌వంబ‌ర్ 10న వెలువ‌డ‌నున్నాయి. కాగా, గ‌త 40 ఏండ్ల బీహార్ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో లాలూ లేకుండా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియడం ఇదే మొద‌టిసారి. లాలూ ప్ర‌సాద్ పాల‌నా కాలాన్ని జేడీయూ, ఎన్డీఏ కూట‌మి ఆట‌విక రాజ్యంగా అభివ‌ర్ణించింది.

లాలూ 1990 నుంచి 97 వ‌ర‌కు బీహార్ సీఎంగా ప‌నిచేశారు. 1997లో దానా కుంభ‌కోణంలో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో త‌న ప‌దవికి రాజీనామా చేశారు. అనంత‌రం రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) పార్టీని స్థాపించారు. లాలూ మొద‌టిసారిగా 1977లో ఎంపీగా ఎన్నిక‌య్యారు.