శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 17:32:47

ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి టాప‌ర్ల‌కు కార్ల బ‌హుక‌ర‌ణ‌

ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి టాప‌ర్ల‌కు కార్ల బ‌హుక‌ర‌ణ‌

రాంచీ : జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్‌(జెఏసీ) నిర్వ‌హించిన 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ మ‌హ‌తో నేడు కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. జార్ఖండ్‌లో బోర్డు పరీక్షా ఫలితాలను జూలైలో ప్రకటించారు. ఫలితాల ప్రకటన సమయంలో టాపర్ల పేర్లను ప్రకటించలేదు. ఫ‌లితాల ప్ర‌క‌ట‌న స‌మ‌యంలోనే టాప‌ర్ల‌కు కార్లు బ‌హుమతిగా అంద‌జేయనున్న‌ట్లు మంత్రి తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు దివంగత బినోద్ బిహారీ మహాతో జయంతి సందర్భంగా మంత్రి టాప‌ర్ల‌కు కార్ల కీలను అందజేశారు. ప‌దో త‌ర‌గ‌తి మాత్ర‌మే చ‌దివిన విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ త‌న విద్యాభ్యాసాన్ని కొన‌సాగిస్తున్నారు. చ‌దువుకునేందుకు వ‌య‌స్సుతో ప‌నిలేద‌న్న ఆయ‌న ఇంట‌ర్మీడియ‌ట్‌లో అడ్మిట్ అయ్యారు. 

బోర్డు పరీక్షలలో బాగా రాణించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇతర రాష్ట్రాలు సైతం ఇటువంటి ప్రోత్స‌హాకాల‌నే ప్ర‌క‌టించాయి. అసోంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులకు ఆనందరామ్ బోరూహ్ అవార్డు కింద రూ. 20 వేల నగదు బహుమతి అంద‌జేస్తున్నారు. ప్రగ్యాన్ భారతి పథకం కింద 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో ఫ‌స్ట్ క్లాస్ డివిజ‌న్ సాధించిన 22 వేల మంది బాలికలకు స్కూటీలు లభించ‌నున్నాయి. హర్యానా విద్యా మంత్రి ఓం ప్రకాష్ యాదవ్ 12 వ తరగతి బోర్డు పరీక్షలలో రాష్ట్ర టాపర్‌కు రూ. 21 వేలు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 10, 12వ త‌ర‌గ‌తి టాపర్లకు రూ .1 లక్ష నగదు, ల్యాప్‌టాప్ ప్రకటించింది. 


logo