బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 21:24:41

సీఎంపై ఆరోపణలు.. బీజేపీ అధ్యక్షుడిపై దేశద్రోహం కేసు

సీఎంపై ఆరోపణలు.. బీజేపీ అధ్యక్షుడిపై దేశద్రోహం కేసు

రాంచి: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై ఆరోపణలు చేసిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. దుమ్కా, బెర్మో నియోజకవర్గాల్లో ఈ నెల 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో శుక్రవారం దుమ్కాలో ప్రచారం సందర్భంగా హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంపై దీపక్‌ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని తెలిపారు. అనంతరం బీజేపీ సీఎం ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఆయన హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కాగా ప్రకాష్‌ వ్యాఖ్యలపై దుమ్కా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శ్యామల్‌ కుమార్‌ సింగ్‌ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ ప్రకాష్‌పై దేశద్రోహంతో పలు సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన దమ్ముంటే తనను అరెస్ట్‌ చేయాలని ఆదివారం సవాల్‌ విసిరారు. సోరెన్‌ ప్రభుత్వం మధ్యలో కూలిపోతుందని, తాను అన్నమాటకు కట్టుబడి ఉంటానన్నారు. ఏమి జరిగినా సరే ప్రజా సమస్యలపై సీఎంను ప్రశ్నిస్తానని దీపక్‌ ప్రకాష్‌ అన్నారు. 

మరోవైపు దుమ్కాలో మీడియాతో మాట్లాడిన సీఎం హేమంత్‌ సోరెన్‌ బీజేపీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆ పార్టీకి నమ్మకం లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జార్ఖండ్‌లో కూడా ఎమ్మెల్యేలను డబ్బులతో కొని అధికారంలోకి రావాలని చూస్తున్నదని ఆరోపించారు. దీపక్‌ ప్రకాష్‌ వ్యాఖ్యలతో ఇది అర్థమవుతున్నదని హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ఏం కుట్ర పన్నుతున్నది అన్నది ప్రకాష్‌పై నమోదైన కేసు దర్యాప్తు ద్వారా బయటపడుతుందని చెప్పారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.