ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 18:45:49

ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

న్యూఢిల్లీ: ఇటీవలే జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీని కూడా వెల్లడించింది. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలతోపాటు నీట్‌ పరీక్ష ప్రతి ఏడాది మే నెలలోనే జరుగుతాయి. కానీ ఈసారి కరోనా వైరస్‌ ప్రబలడంతో షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించడం కుదరలేదు. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో అన్ని పరీక్షలతోపాటే ఐఐటీ-జేఈఈ, నీట్‌ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. కరోనా ప్రభావం ఎప్పటివరకు కొనసాగుతుందోనన్న సందేహంతో పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడటంతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మూడు రోజుల క్రితం జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షల తేదీలను వెల్లడించింది. జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో, నీట్‌ పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని ప్రకటించింది.    


logo