సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 14:42:13

పార్టీ నుంచి ఎమ్మెల్సీ సస్పెన్షన్‌

పార్టీ నుంచి ఎమ్మెల్సీ సస్పెన్షన్‌

పాట్నా : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ దినేష్ ప్రసాద్ సింగ్‌ను పార్టీ నుంచి జనతాదళ్‌ (యూ) సస్పెండ్ చేసింది. లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కుమార్తె విజయానికి పాటుపడుతున్నట్లుగా దినేష్‌ ప్రసాద్‌ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ జేడీయూ ప్రధాన కార్యదర్శి నవీన్‌ కుమార్‌ ఆర్య ఉత్తర్వులు జారీ చేశారు. 

లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేయాలని కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఎమ్మెల్సీ దినేష్ ప్రసాద్ సింగ్పై పార్టీ అధిష్టానానికి పలు ఫిర్యాదు అందాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముజఫ్ఫర్‌పూర్‌ స్థానం నుంచి ఎల్జేపీ అభ్యర్థి దినేష్ ప్రసాద్ సింగ్‌ కుమార్తె కోమల్‌సింగ్‌ పోటీ పడుతున్నారు. కుమార్తె విజయం కోసం పనిచేయాలంటూ ముజఫ్ఫర్‌పూర్‌లోని జనతాదళ్‌ కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు పార్టీకి ఫిర్యాదు చేశారు. దాంతో దినేష్ ప్రసాద్ సింగ్‌ కార్యకలాపాలపై విచారణ జరిపిన పార్టీ నేతలు.. ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని లేఖలో నవీన్‌ కుమార్‌ ఆర్య సూచించారు. దినేష్ ప్రసాద్ సింగ్ భార్య వీణాసింగ్ వైశాలి పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌జనశక్తి ఎంపీగా విజయం సాధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.