శనివారం 05 డిసెంబర్ 2020
National - Sep 10, 2020 , 16:02:17

ప్ర‌ధాని మోదీకి జ‌పాన్ ప్ర‌ధాని ఫోన్‌!

ప్ర‌ధాని మోదీకి జ‌పాన్ ప్ర‌ధాని ఫోన్‌!

న్యూఢిల్లీ: జపాన్ ప్ర‌ధాని షింజో అబే గురువారం మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు సమన్వయంతో సాధించిన విజయాల గురించి ఈ సంద‌ర్భంగా వారు చర్చించారు. జపాన్-భారత్ మధ్య సంబంధాల్లో, మౌలిక విధానాల్లో మార్పు ఉండబోదని.. ర‌క్ష‌ణ‌, ఆర్థిక రంగాల్లో మరింత సన్నిహితంగా సహకరించుకోవాలని ఇరు దేశాల ప్రధానులు చ‌ర్చించుకున్నారు. దాదాపు 30 నిమిషాల‌పాటు వీరి టెలిఫోన్ సంభాష‌ణ కొన‌సాగింది. ఈ మేర‌కు జ‌పాన్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

షింజో అబే అనారోగ్య కారణాలవ‌ల్ల‌ ప్రధాని పదవి నుంచి వైదొలగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు గ‌త నెల‌ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య టెలిఫోన్ సంభాష‌ణ‌లో ఈ విష‌యం కూడా చ‌ర్చకు వ‌చ్చింది.  మోదీతో స్నేహం, నమ్మకంతో కూడిన సంబంధాలు వృద్ధి చెందినందుకు అబే ధన్యవాదాలు తెలిపారు. జపాన్ నాయకత్వ మార్పు ప్రభావం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఉండబోదని ఇరు దేశాల నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. 

భార‌త్‌-జ‌పాన్ మౌలిక విధానం మారబోదని, ద్వైపాక్షిక సంబంధాల విష‌యంలో సన్నిహితంగా సహకరించుకోవాలని ఇరు దేశాల ప్ర‌ధానులు నిర్ణయించారు. ఇటీవలి సంవత్సరాల్లో ద్వైపాక్షిక సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుప‌డిన విషయాన్ని షింజో అబే ప్రస్తావించారు. ఈ నెల 9న ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మోదీ, అబే స్వాగతించారు. భారత్‌, జపాన్ మధ్య సత్సంబంధాలను వృద్ధి చేయడంలో అబే నాయకత్వాన్ని మోదీ ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.