మంగళవారం 31 మార్చి 2020
National - Mar 22, 2020 , 09:39:26

జ‌న‌తా క‌ర్ఫ్యూ.. దేశ‌మంతా నిర్మానుషం

జ‌న‌తా క‌ర్ఫ్యూ.. దేశ‌మంతా నిర్మానుషం

హైద‌రాబాద్‌ : క‌రోనా వైర‌స్‌పై ఇది ప్ర‌జా పోరాటం.  ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా ఉంటుంది.  వుహాన్ న‌గ‌రం సెల్ఫ్ క్వారెంటైన్ పాటించిన‌ట్లే.. ఇవాళ మ‌న దేశం కూడా నిర్మానుషంగా మారింది.  అన్ని రాష్ట్రాల్లో, అన్ని వీధులు.. ఇలా జ‌నం లేకుండా నిశ‌బ్ధంగా మారాయి. ప్రాణాంత‌క నోవెల్ క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు మ‌న‌కు ఈ ప‌ద్ధ‌తే ఒక ఆయుధంగా మారింది.  రోజు రోజుకూ వాయువేగంతో విస్త‌రిస్తున్న కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు దేశ ప్ర‌జ‌లు జ‌న‌తా క‌ర్ఫ్యూలో పాల్గొంటున్నారు. 


క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 12 వేల మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. జ‌లుబు, జ్వ‌రంతో పాటు న్యూమోనియా వ్యాధి ల‌క్ష‌ణాల‌తో జ‌నం క‌కావిక‌ల‌మ‌వుతున్నారు.  మ‌హా విల‌యంగా మారిన క‌రోనాకు ఇంకా మందు క‌నిపెట్ట‌లేదు.  దాని ల‌క్ష‌ణాల‌ను శాస్త్ర‌వేత్త‌లు ఇంకా స్ట‌డీ చేస్తూనే ఉన్నారు.  కానీ ఆ వైర‌స్ జీవకోటికి ప్ర‌మాదంగా మారింది. దాన్ని నియంత్రించే ప‌ద్ధ‌తిలో భాగంగా జ‌న‌మే స్వ‌యంగా క‌ర్ఫ్యూలో పాల్గొంటున్నారు.  గుంపులు, గుంపులుగా జ‌నం ఉండకూడ‌దు. ఒక‌రి నుంచి ఒక‌రికి వైర‌స్ సోక‌వ‌ద్దు అన్న నిశ్చ‌యంతో ఈ క్వారెంటైన్ పాటించాలి. స్వీయ నియంత్ర‌ణే శ్రీరామ ర‌క్ష‌. 


సామాజికంగా ఒక‌ర్ని ఒక‌రు దూరం పెట్ట‌డం క‌ర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రాలే కాదు.. మారుమూల గ్రామాలు కూడా వైర‌స్‌పై పోరాటానికి దిగాయి.  కొన్ని దేశాలు ముందు జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాయి. ఆ ప‌ర్య‌వ‌సానాలు ఆయా దేశాల‌ను దారుణంగా దెబ్బ‌తీశాయి. ఇప్పుడు మ‌నం అలాంటి నిర్ల‌క్ష్యానికి ఎటువంటి అవ‌కాశం ఇవ్వ‌వొద్దు.  వైర‌స్ క‌ట్ట‌డి కోసం ఎంత త్వ‌ర‌గా రియాక్ట్ అయితే, మ‌న ప్రాణాలు అంత క్షేమంగా ఉంటాయి.  ఇది ప్ర‌పంచ ఉనికికి దోహ‌ద‌ప‌డుతుంది.


130 కోట్ల మంది జ‌నాభా ఉన్న భార‌త్‌.. క‌చ్చితంగా వైర‌స్‌పై గ‌ట్టి పోరాటం చేయాల్సిందే. చైనా త‌ర్వాత అత్య‌ధిక జ‌నాభా ఉన్న‌ది మ‌న ద‌గ్గ‌రే. మ‌న‌క‌న్నా ఎక్కువ జ‌నాభా ఉన్న దేశంలో పుట్టిన వైర‌స్‌ను ఆ దేశం స‌క్సెస్‌ఫుల్‌గా నియంత్రించ‌గలిగింది.  వుహాన్ స్పూర్తితోనే మ‌నం కూడా క్వారెంటైన్ కావాల్సిందే.  ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు నిస్సందేహాంగా ఐసోలేట్ కావాలి.  స్వీయ ప‌రిశుభ్ర‌త ఇప్పుడు అంద‌రి బాధ్య‌త‌. క‌నురెప్ప మూసి తెరిచేలోపే వైర‌స్ విజృంభిస్తోంది.  ఏమాత్రం అల‌క్ష్యం చేసినా..అది మ‌న ప్రాణాల‌కే చేటుగా మారుతుంది. 


జాన్స్ హాపిక్స్ వ‌ర్సిటీ తాజా లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకింది. 12,944 మంది మ‌ర‌ణించారు. చైనా, ఇట‌లీ, ఇరాన్‌, స్పెయిన్‌, ద‌క్షిణ‌కొరియా, అమెరికా దేశాలు ఈ వైర‌స్ వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం నెల‌కొన్న‌ది. మునుముందు అనేక దేశాలు ఆర్థిక సంక్షోభం నుంచి గ‌ట్టెక్క‌డం అంత ఈజీ కాదు.  విష‌పూరిత క‌రోనాపై భార‌త్ కూడా తీవ్రంగా పోరాడుతోంది.  ఇప్పుడు మ‌నం పాటించే స్వీయ ప‌రిశుభ్ర‌తే.. మ‌న దేశ మ‌నుగ‌డకు బాస‌ట‌గా నిలుస్తుంది. ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌డం శ్రేయ‌స్క‌రం.  ప్రివెన్ష‌న్ ఈజ్ బెట‌ర్ దెన్ క్యూర్‌.logo
>>>>>>