గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 01:03:48

జయహో.. జనతా!

జయహో.. జనతా!

  • కరోనాపై భారత్‌ సమరభేరి.. జనతా కర్ఫ్యూ విజయవంతం
  • ఇంటికే పరిమితమైన యావత్‌ భారతావని
  • సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో మార్మోగిన దేశం
  • వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందికి జనం జేజేలు

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా మహమ్మారిపై భారత్‌ సమరభేరి మోగించింది. వైరస్‌ పీచమణిచేందుకు దేశమంతా ఒక్కటైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ దాదాపు ఇండ్లకే పరిమితమయ్యారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు ఎడారులను తలపించాయి. మార్కెట్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మాత్రం కొనసాగాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు, ఇతర సిబ్బందికి ప్రజలు జేజేలు పలికారు. సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టడం ద్వారా సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో కర్ఫ్యూను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు పూలు అందించి ఇంటి వద్దనే ఉండాలని కోరారు. ముంబై దాదాపు దిగ్బంధంలో ఉన్నది. కర్ఫ్యూ సమయంలో క్రికెట్‌ ఆడుతున్న ఎనిమిది మందిని థానే పోలీసులు అరెస్ట్‌చేశారు. కశ్మీర్‌ లోయలో లాక్‌డౌన్‌ నాలుగో రోజుకు చేరుకున్నది. జనతా కర్ఫ్యూను సోమవారం ఉదయం వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌ యావత్తూ స్వీయ నిర్బంధంలో ఉన్నది. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లలో రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఎడారులను తలపించాయి. గోవాలో బీచ్‌లు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం ప్రార్థనలను గోవా చర్చి రద్దుచేసింది. కేరళ పూర్తిస్థాయి దిగ్బంధంలో ఉన్నది.పశ్చిమ బెంగాల్‌లో దాదాపు షట్‌డౌన్‌ పరిస్థితి కనిపించింది. ప్రజలు సోమవారం ఉదయం 8 గంటల వరకు ఇండ్లకే పరిమితం కావాలని అసోం సర్కారు విజ్ఞప్తిచేసింది. మణిపూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. మిజోరాంలో వారంపాటు పాక్షిక లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగిలిన రాష్ర్టాల్లోనూ కర్ఫ్యూ విజయవంతమైంది. 


ఈనెల 31 వరకు  లాక్‌డౌన్‌ పాటిస్తున్న రాష్ర్టాలు

ఢిల్లీ:సరిహద్దులు, అన్ని వాణిజ్య కార్యకలాపాలు మూసివేత, వైద్యం, ఆహారం, నీరు, విద్యుత్‌వంటి అత్యవసర  సేవలకు మినహాయింపు

నాగాలాండ్‌:పెట్రోట్‌ బంకులు, అన్ని రకాల షాపులు, మెడికల్‌ స్టోర్లు, ఆహార దుకాణాలు మూసివేత, ప్రజారవాణాతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా రోడ్లమీదకు రాకూడదు

ఉత్తరాఖండ్‌:వైద్యం, ఆహారం వంటి అత్యవసర సేవలకు మినహాయింపు

పంజాబ్‌:పాలు, ఆహారం అమ్మే దుకాణాలు, మెడికల్‌ స్టోర్లుకు మినహాయింపు, అత్యవసర ప్రభుత్వ సేవలు కొనసాగుతాయి. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికుల జీతంలో కోత విధించవద్దని పారిశ్రామికవేత్తలకు సీఎం అమరీందర్‌ విజ్ఞప్తి

చండీగఢ్‌:ప్రైవేట్‌ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు,కర్మాగారాలు మూసివేత, ప్రజా రవాణాపై ఆంక్షలు

గోవా:జనతా కర్ఫ్యూ కొనసాగింపు (బుధవారం వరకు)

ఏపీ:పేదలకు ఉచిత రేషన్‌, తక్షణ అవసరాలకు కోసం రేషన్‌ ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. ఒక వెయ్యి సాయం, ప్రజారవాణాపై ఆంక్షలు

ఇంటిని ఇలా శుభ్రపరచుకోండి..

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యం. మనతోపాటు మనముండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ తాకే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలి. అప్పుడే వైరస్‌ మన దరిచేరదు. ఈ నేపథ్యంలో ఇంటిని ఎలా శుభ్రపరుచుకోవాలో చూద్దాం..

  • మనం ఎక్కువగా తాకే ప్రదేశాలను తరచూ సబ్బు, నీటితో శుభ్రంచేసుకోవాలి. టేబుళ్లు, స్విచ్‌లు, డోర్లు, కిచెన్‌, సింక్‌లు, హ్యాండిళ్లు,    డెస్క్‌లు, ఫోన్లు, కీబోర్డులు, టాయ్‌లెట్లు, కొళాయిలు తదితర వాటిని తరచూ శుభ్రపరచుకోవాలి.
  • బ్లీచ్‌, ఆల్కహాల్‌ ద్రావణాలను ఉపయోగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తగిన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. కనీసం 70 శాతం ఆల్కహాల్‌ ఉన్న ద్రావణాలను ఉపయోగించవచ్చు.
  • కార్పెట్లు, రగ్గులు, తెరలను సబ్బు లేదా ఇతర క్రిమిసంహారక ద్రావణాలతో క్లీన్‌ చేసుకోవాలి. పూర్తిగా ఆరేటట్లు చూసుకోవాలి.
  • దుస్తులు, టవళ్లు, ఇతర వస్ర్తాలను ఉతికేటప్పుడు డిస్పోజబుల్‌ గ్లవ్స్‌ను తప్పక ధరించాలి. అపరిశుభ్రంగా ఉన్న వాటిని ముట్టుకోకూడదు. రోగుల దుస్తులను వేరుగా ఉతకాలి. వాషింగ్‌ కోసం వేడినీటిని ఉపయోగించాలి.
  • చేతులను తరచూ కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. వ్యాధితో బాధపడుతున్నవారిని కలిసిన తర్వాత, గ్లవ్స్‌ తొలిగించిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకోవాలి. 
  • వైరస్‌ బాధితులు ప్రత్యేకంగా వేరే గదిలో ఉండాలి. అక్కడే భోజ నం, నిద్ర చేయాలి. పాత్రలు, ఇతర వస్తువుల ను వేడి నీటితో గ్లవ్స్‌ ధరించి శుభ్రం చేయాలి. బాధితులకు ప్రత్యేకంగా ఒక డస్ట్‌బిన్‌ను కేటాయించాలి. చెత్తను తొలిగించేటప్పుడు తప్పక గ్లవ్స్‌ ధరించాలి. తర్వాత చేతులు కడుక్కోవాలి. logo