శనివారం 23 జనవరి 2021
National - Dec 04, 2020 , 15:20:29

జమ్ముకశ్మీర్‌లో డీడీసీ అభ్యర్థిపై కాల్పులు

జమ్ముకశ్మీర్‌లో డీడీసీ అభ్యర్థిపై కాల్పులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) మూడో దశ ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దక్షిణ కశ్మీర్‌లోని కోకెర్నాగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ అభ్యర్థిని అనీస్‌ ఉల్‌ ఇస్లాంగా గుర్తించారు. బుల్లెట్‌ గాయాలైన అతడ్ని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. అనీస్‌ ఇటీవల అప్నీ పార్టీలో చేరి డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు నేషనల్‌ కాన్ఫరేన్స్‌ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఈ ఘటనను ఖండించారు. శాంతియుతంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలను భగ్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ పునర్వవస్థీకరణ అనంతరం తొలిసారి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ, జమ్ముకశ్మీర్‌ ఏకీకరణ కోసం గుప్కార్‌ డిక్లరేషన్‌లో భాగంగా కూటమిగా ఏర్పడిన పీడీపీ, ఎన్సీ వంటి కీలక పార్టీలు, బీజేపీ, అల్తాఫ్‌ బుఖారీకి చెందిన అప్నీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. అప్నీ పార్టీని బీజేపీ బీ టీంగా పీపుల్స్‌ కూటమి ఆరోపిస్తున్నది. logo