సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 03:08:09

జగ్గీ వాసుదేవ్‌.. దొంగబాబా

జగ్గీ వాసుదేవ్‌.. దొంగబాబా
  • భార్యను చంపేశాడు.. భూములు లాక్కున్నాడు
  • వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ తీవ్ర ఆరోపణలు

భోపాల్‌: ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌పై మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్‌(జల వనరుల పరిరక్షకుడు)గా ప్రసిద్ధి చెందిన రాజేంద్రసింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. జగ్గీ వాసుదేవ్‌ తనను తాను సద్గురువుగా చెప్పుకోవచ్చని, వాస్తవానికి ఆయన దొంగబాబా అని విమర్శించారు. నీటిహక్కు చట్టంపై మంగళవారం జరుగబోయే సెమినార్‌లో పాల్గొనేందుకు భోపాల్‌కు చేరుకున్న రాజేంద్రసింగ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. నదుల పునరుజ్జీవనానికి మిస్డ్‌కాల్‌ ఇవ్వండి అంటూ జగ్గీ వాసుదేవ్‌ గతంలో నడిపించిన ప్రచారంపై నిప్పులు చెరిగారు. ‘ఎంత మోసం ఇది. మిస్డ్‌కాల్స్‌తో నదులు పునరుజ్జీవనం అవుతాయా?’ అని ఆయన ప్రశ్నించారు. జగ్గీ వాసుదేవ్‌ తన భార్యను కూడా హత్యచేశారని ఆరోపించారు. వినోభాభావే భూదాన ఉద్యమం కింద కోయంబత్తూర్‌లో రైతులకు పంపిణీ చేసిన భూములను జగ్గీ వాసుదేవ్‌ కబ్జా చేశారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న కంప్యూటర్‌ బాబాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అధికారం కోసం తహతహలాడేవారు నదులను రక్షించలేరని, ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. రాజేంద్రసింగ్‌ ఆరోపణలను ఈశా ఫౌండేషన్‌ ఖండించింది. ఆ ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని తెలిపింది. మతిస్థిమితం లేకపోవడం వల్ల లేదా ఈ విధంగా పేరుపొందాలనే నీచ ఆలోచన వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని విమర్శించింది. 


logo