మంగళవారం 19 జనవరి 2021
National - Jan 03, 2021 , 17:44:29

ఇక అందరికీ జగన్నాథస్వామి దర్శనం.. కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి

ఇక అందరికీ జగన్నాథస్వామి దర్శనం.. కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి

పూరి : దేశవ్యాప్తంగా భక్తులందరికీ నేటి నుంచి పూరి జగన్నాథస్వామి దర్శన భాగ్యం ప్రారంభమైంది. కొవిడ్‌ -19 నెగిటివ్‌ రిపోర్టు సమర్పించిన వారిని మాత్రమే అధికారులు ఆలయంలోకి అనుమతించారు. ఆలయ పరిసరాల్లో కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ‘ఆలయానికి వచ్చే భక్తులు విధిగా మాస్కు ధరించాలి. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. భౌతికదూరం పాటించాలి. మూడురోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ వచ్చిన వారే దర్శనానికి రావాలి’ అని సూచించారు. ఆలయంలోకి రాగానే భక్తుల ఆధార్‌ కార్డు, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు 15 పటాలాల పోలీసు సిబ్బందిని, 50 మంది అధికారులను ఆలయం వద్ద మోహరించినట్లు పూరి ఎస్పీ కన్వార్‌ విశాల్‌ సింగ్‌ తెలిపారు. నూతన సంవత్సరం రద్దీ దృష్ట్యా గత గురువారం, శుక్రవారం ఆలయాన్ని మూసివేశారు. నిన్నటి వరకు కేవలం స్థానిక భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు సమర్పించకపోవడంతో ఆదివారం దర్శనానికి వచ్చిన వందలాది భక్తులను అధికారులు వెనక్కు పంపారు. పూరిలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ పరీక్ష చేయించుకునేందుకు పర్యాటకులకు అనుమతి లేకపోవడంతో చాలామంది భువనేశ్వర్‌కు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.