శనివారం 06 మార్చి 2021
National - Jan 26, 2021 , 17:27:35

అమ‌ర్‌నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!

అమ‌ర్‌నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!

శ్రీ‌న‌గ‌ర్‌: వ‌చ్చే వేస‌విలో మొద‌ల‌య్యే అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వ‌చ్చే యాత్రికుల కోసం జ‌మ్ముక‌శ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అమ‌ర్‌నాధ్‌లోని హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉద్భ‌వించే మంచు శివ‌లింగాన్ని భ‌క్తులు ద‌ర్శించుకుంటారు.  జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తినిచ్చే 370వ అధిక‌ర‌ణం ర‌ద్దుతో 2019లో, క‌రోనా మ‌హ‌మ్మారి ముప్పు నేప‌థ్యంలో 2020లో అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. రెండేండ్ల అంత‌రాయం త‌ర్వాత వ‌చ్చే వేస‌విలో అమ‌ర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంద‌ని భావిస్తున్నారు. 

జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా ర‌ద్దు చేసిన త‌ర్వాత తొలిసారిగా ఈ ఏడాది జరిగే యాత్ర‌లో ఆరు ల‌క్ష‌ల మంది భ‌క్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికులు నిర‌స‌న‌లు తెలుపుతార‌న్న ఆందోళ‌న‌ల మ‌ధ్య 2019 ఆగ‌స్టు ఐదో తేదీన జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా ర‌ద్దు చేయ‌డానికి కొద్ది రోజుల ముందు ఇత‌ర ప్రాంతాల సంద‌ర్శ‌కులు త‌క్ష‌ణం క‌శ్మీర్‌లోయ‌ను వీడి వెళ్లాల‌ని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 2011లో అత్య‌ధికంగా 6.35 ల‌క్ష‌ల మంది యాత్రికులు మంచు శివ‌లింగాన్ని ద‌ర్శించుకున్నారు.

2012లో 6.22 ల‌క్ష‌ల మంది యాత్ర‌లో పాల్గొన్నారు. భ‌క్తులు, సంద‌ర్శ‌కుల సంఖ్య పెరుగ‌డం వ‌ల్ల ప‌ర్వ‌త శ్రేణుల స‌హ‌జ ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత 2013లో భారీస్థాయిలో 6 ల‌క్ష‌ల మంది భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని భావించినా.. 3.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే పాల్గొన్నారు. 2014లో 3.7 ల‌క్ష‌ల మంది, 2015లో 3.5 ల‌క్ష‌లు, 2016లో 2.2 ల‌క్ష‌లు, 2017లో 2.6 ల‌క్ష‌లు, 2018లో 2.8 ల‌క్ష‌లు, 2019లో 3.8 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్నారు. 

హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ బుర్హాన్ వ‌నీ ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత స్థానికులు నిర‌స‌న తెలుప‌డంతోపాటు ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ విధించ‌డంతో అతి త‌క్కువ‌గా సంద‌ర్శ‌కులు మంచు శివ‌లింగాన్ని ద‌ర్శించుకున్నారు. రోజురోజుకు హింస పెరుగ‌డంతో 2013 నుంచి సంద‌ర్శ‌కుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది.  ద‌క్షిణ క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ జిల్లా చంద‌న్‌వ‌రీ, సెంట్ర‌ల్ క‌శ్మీర్‌లోని బ‌ల్టాల్ రూట్ల వ‌ద్ద నుంచి యాత్ర‌ను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం విస్త్రుత భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo