బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 20:57:57

శ్రీనగర్‌లో ప్రముఖ న్యాయవాది కాల్చివేత

శ్రీనగర్‌లో ప్రముఖ న్యాయవాది కాల్చివేత

జమ్ముకశ్మీర్‌ : శ్రీనగర్‌లో ప్రముఖ న్యాయవాది, టీవీ ప్యానలిస్ట్ బాబర్ ఖాద్రిని గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్చి చంపారు. సాయంత్రం 6.25 గంటల సమయంలో అతడిపై తన హవాల్ నివాసం వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాబర్‌ ఖాద్రిని తన స్థానిక స్కిమ్స్ దవాఖానకు తరలించగా అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.

తన మరణానికి ముందు బాబార్‌ ఖాద్రి తనపై "తప్పుడు ప్రచారం" చేసినందుకు ఒక ఫేస్‌బుక్ వినియోగదారుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జమ్ములోని పోలీసులను కోరుతూ స్క్రీన్ షాట్ ట్వీట్ చేశారు. "ఏజెన్సీల కోసం నేను పనిచేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసిన షా నజీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను రాష్ట్ర పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ అసత్య ప్రకటన నా ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది" అని ఖాద్రి తన చివరి ట్వీట్‌లో రాశారు. 

గత 24 గంటల్లో ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండవ రాజకీయ లేదా సామాజిక కార్యకర్తగా ఖాద్రి నిలిచారు. నిన్న రాత్రి బుద్గాం జిల్లాలోని ఖాగ్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు భూపిందర్ సింగ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బీజేపీ నాయకులకు ఉగ్రవాద సంస్థల నుంచి మరణ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. జూలైలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాద సంస్థలు తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్, కొత్తగా పుంజుకున్న అల్ బదర్ నుంచి మరణ బెదిరింపులను అందుకున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బందీపోరాలో బీజేపీ సీనియర్ కార్యకర్త వసీమ్ బారిని తన తండ్రి, సోదరుడితో పాటు ఉగ్రవాదులు కాల్చి చంపారు. బీజేపీతో సంబంధం ఉన్న ఎవరైనా "కశ్మీర్ వ్యతిరేక ఎజెండాను" మరింతగా పెంచుకుంటే ఇదే మాదిరి చర్యను ఎదుర్కొంటారని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి.


logo