గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 18, 2021 , 23:59:29

వాట్సాప్ ప్రైవ‌సీపై యూజ‌ర్ నిర్ణ‌యం స్వ‌చ్ఛందం

వాట్సాప్ ప్రైవ‌సీపై యూజ‌ర్ నిర్ణ‌యం స్వ‌చ్ఛందం

న్యూఢిల్లీ: ‌సోష‌ల్ మీడియా దిగ్గ‌జం  ‌ఫేస్‌బుక్ అనుబంధ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్ర‌క‌టించిన స‌రికొత్త ప్రైవ‌సీ పాల‌సీని అంగీక‌రించాలా? వ‌ద్దా? అన్న విష‌యం వినియోగ‌దారుల స్వ‌చ్ఛందం అని ఢిల్లీ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. వాట్సాప్‌ నిబంధనలను అంగీకరించేవారు అందులోనే కొనసాగవచ్చని, లేని వారు బయటకు రావొచ్చున‌ని సోమవారం తెలిపింది. వాట్సాప్ అనేది ఓ ప్రైవేట్ యాప్ అని, అందులో చేరవద్దని పిటిషనర్ వాదించారు.  అది యూజ‌ర్లు తీసుకోవాల్సిన స్వ‌చ్ఛంద నిర్ణ‌యం అని , దాని నిబంధనలు అంగీకరించడానికి బదులు కొత్త యాప్‌ను ఉపయోగించుకోవాలని జ‌స్టిస్ సంజీవ్ స‌చ్‌దేవా సూచించారు. వాట్సాప్ కొత్త పాలసీని సవాలు చేస్తూ ఒక న్యాయ‌వాది.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

ష‌ర‌తులు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే

చాలా వరకు మొబైల్ యాప్‌ల నియమ నిబంధనలు ఇలానే ఉంటాయని, మీరు వాటిని చదివితే కనుక ఎటువంటి షరతులకు అంగీకరించిందీ తెలిసి ఆశ్చర్యపోతారని ధ‌ర్మాస‌నం పేర్కొంది. చివరికి గూగుల్ మ్యాప్స్ కూడా మీ డేటా మొత్తాన్ని సేకరించి నిల్వ‌ చేస్తుందని కోర్టు తెలిపింది. వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ విధానం ప్ర‌కారం ఆన్‌లైన్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే వ్య‌క్తుల డేటాను ఆ సంస్థ పొంద‌గ‌ల‌ద‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. దీనిపై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ అసాధ్యం అని స్ప‌ష్టం చేసింది. 

డేటా లీక్‌పై విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌న్న ధ‌ర్మాస‌నం

అయితే ఎలాంటి డేటా లీకవుతుందన్న విషయం పిటిష‌న్‌లో అర్థం కాలేదని, సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందన్న‌ది.  సమయాభావం కారణంగా ఇప్పుడు కుదరదని, ఈ నెల 25న పరిశీలిద్దామని పేర్కొంది. కేంద్రం కూడా ఇందుకు అంగీకరించింది. సమస్యను విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌బుక్ తరపున విచార‌ణ‌కు హాజ‌రైన‌ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదిస్తూ.. పిటిష‌నర్ వ‌ద్ద ఎటువంటి ఆధారాల్లేవ‌న్నారు. 

కొత్త పాల‌సీలోనూ ప్రైవ‌సీ భ‌ద్ర‌మ‌న్న వాట్సాప్‌

కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ప్రైవేట్‌ చాట్ మెసేజ్‌లు మాత్రం ఎన్‌క్రిప్ట్‌గానే ఉంటాయని, వాట్సాప్ వాటిని నిల్వ‌ చేయదని కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే, వ‌చ్చేనెల 8వ తేదీ నుంచి కొత్త ప్రైవ‌సీ పాల‌సీ తేనున్న‌ట్లు ప్ర‌క‌టించిన వాట్సాప్‌.. దానిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో వెన‌క్కు త‌గ్గింది. మూడు నెల‌ల పాటు కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అమ‌లును వాయిదా వేసింది. అంత‌కుముందు ఈ నెల నాలుగో తేదీ నుంచి కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ఆమోదించాలంటూ త‌న యూజ‌ర్ల‌కు వాట్సాప్ నోటిఫికేష‌న్లు పంపుతూ వ‌చ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo