గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 04:47:55

సరిహద్దుల మూత

సరిహద్దుల మూత
  • దేశాల స్వీయ దిగ్బంధం
  • ఆరువేలు దాటిన కరోనా మృతులు
  • ఇటలీలో ఒక్కరోజే 368 మరణాలు నమోదు
  • ఇరాన్‌, స్పెయిన్‌లో వంద మంది చొప్పున.. ప్రజలు గుమిగూడకుండా పలు దేశాల్లో నిషేధం
  • ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం

బీజింగ్‌/మాడ్రిడ్‌/లండన్‌/వాషింగ్టన్‌/టెహ్రాన్‌, మార్చి 15: ప్రాణాంతక కరోనా(కొవిడ్‌-19) పంజా విసురుతున్నది. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు లను మూసివేస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని మూసివేశాయి. దీంతో ఆయా దేశాల్లోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. ఈ మ మహమ్మారికి ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 6,455 మంది చనిపోయారు. బాధి తుల సంఖ్య 1.67లక్షలకు పెరిగింది. 


ప్రధాని భార్యకు, మంత్రులకు వైరస్‌

స్పెయిన్‌ను కరోనా వణికిస్తున్నది. ఆ దేశ ప్రధాని పెడ్రో సంచేజ్‌ సతీమణి బెగోనా గొమేజ్‌కు వైరస్‌ సోకినట్టు అధికారులు ధ్రువీకరించారు.  పెడ్రో క్యాబినెట్‌లోని మరో ఇద్దరు మంత్రులకు కూడా కరోనా సోకినట్టు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. ఆహారం, అత్యవసర వైద్య సామగ్రి కొనుగోలు, దవాఖానకు వెళ్లడం, బ్యాంకు పని, రోజూవారీ ఆఫీసు పని మినహా మరే ఇతర పనుల కోసం బయటకు రావొద్దని ప్రజల్ని ఆదేశించారు. గత 24 గంటల్లో దేశంలో రెండు వేల మందికి కరోనా సోకినట్టు, మరో వంద మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో స్పెయిన్‌లో బాధితుల సంఖ్య 7,753కు చేరగా, 288 మంది చనిపోయారు. దేశంలోని ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, స్కూళ్లు, వర్సిటీలను మూసేసినట్టు పేర్కొన్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, పోలాండ్‌, ఫిలీప్పిన్స్‌, ఈస్టోనియా, దక్షిణాఫ్రికా, లిథుయానియాలో కూడా దాదాపు ఇవే ఆంక్షలు విధించారు. సరిహద్దులను సైతం మూసేసినట్టు ప్రకటించారు. వంద కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటాన్ని అమెరికా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు నిషేధించాయి. మరోవైపు, కరోనాతో దేశ బ్యాంకింగ్‌ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ రంగానికి ఊతమిచ్చేలా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) కేంద్ర బ్యాంకు 2,700 అమెరికన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.


పెరుగుతున్న మృతులు

కొవిడ్‌ వెలుగుచూసిన చైనాలో ఆదివారం వైరస్‌తో మరో పదిమంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 3,199కి, బాధితుల సంఖ్య 80,778కి పెరిగింది. దక్షిణ కొరియాలో కరోనాతో 75 మంది చనిపోగా, దాదాపు 8162 మందికి ఈ వైరస్‌ సోకింది. అగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపెడుతున్నది. వైరస్‌ కారణంగా ఆ దేశంలో దాదాపు 60 మంది మృత్యువాత పడ్డారు.  మరో 2,100 మందికి ఈ వైరస్‌ సోకింది. రాజధాని వాషింగ్టన్‌లోనే 40 మంది మరణించారు. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 33కు చేరింది. 


ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌లో మరణమృదంగం

ఐరోపా దేశం ఇటలీని కరోనా కల్లోలపరుస్తున్నది. వైరస్‌సోకి ఆ దేశంలో ఒక్కరోజులోనే 368 మంది మృత్యువాతపడ్డారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1,809కు చేరింది. మరో 24 వేల మంది ఈ వైరస్‌బారిన పడ్డారు. ఇరాన్‌లో ఆదివారం ఒక్కరోజే 113 మంది మరణించారు. దీంతో ఈ మహమ్మారిబారినపడి ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 724 మందికి చేరగా, 13 వేల మందిలో ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. స్పెయిన్‌లో ఆదివారం కరోనాతో వంద మంది మరణించారు.


logo