శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 07:21:38

వికాస్ దూబే ఆస్తుల‌పై ఐటీ విభాగం ఆరా!

వికాస్ దూబే ఆస్తుల‌పై ఐటీ విభాగం ఆరా!

ల‌క్నో: కరడుకట్టిన నేర‌గాడు, కాన్పూర్‌కు చెందిన‌ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఆదాయ పన్నుశాఖ ఆరా తీస్తున్న‌ది. జూలై 2న జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపి ప‌రారీలో ఉన్న దూబే గ్యాంగ్‌లో ఇప్ప‌టికే ఇద్ద‌రు వేర్వేరు ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త‌మయ్యారు. మ‌రో న‌లుగురు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దూబేను కూడా గురువారం ఉద‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, గ్యాంగ్‌స్ట‌ర్ దూబే తక్కువ కాలంలోనే కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఆదాయపుపన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. వికాస్ దూబే సన్నిహితుల‌ పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది. దూబే ఎనిమిది నెలల క్రితం లక్నోలో రూ.5 కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టిన‌ట్లు సమాచారం. వికాస్ దూబేకు 12 ఇండ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు ఇప్ప‌టికే గుర్తించారు.

దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్‌లోనే దూబే మ‌రో సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు తేల్చారు. కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి కూడా సమగ్ర దర్యాప్తు జ‌రుపుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo