శనివారం 16 జనవరి 2021
National - Dec 28, 2020 , 11:43:51

క్రికెట్‌ దాదా బీజేపీలో చేరుతున్నారా?

క్రికెట్‌ దాదా బీజేపీలో చేరుతున్నారా?

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలిని బీజేపీ తురుపుముక్కగా వాడుకోవాలని చూస్తున్నదా? మమతను ఢీకొనడానికి గంగూలీ వంటి దిగ్గజాలు కావాల్సిందేనా? పశ్చిమ బెంగాల్ గవర్నర్‌తో దాదా భేటీ దేనికి సంకేతంగా భావించవచ్చు?.. ఇలా ఎన్నో ప్రశ్నలు సాధారణ ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఎలాంటి అవసరం లేకుండానే గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను గంగూలీ దాదా ఎందుకు కలిశారంటారు.. అని నలుగురు కలిసిన చోట ఇదే విషయాన్ని ముచ్చటించుకుంటున్నారు. గంగూలీ రాకతో బీజేపీలో హీట్‌ పెరుగుతుందని సగటు బీజేపీ కార్యకర్త భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో కూడా దాదాను బీజేపీలో చేరాల్సిందిగా ఆపార్టీ పెద్దలు బహిరంగంగానే కోరారు. 

ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ధన్‌ఖర్‌తో గంగూలీ సమావేశం గంటసేపు కొనసాగింది. ఈ సమావేశం తరువాత, గంగూలీ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే, రాజ్ భవన్‌తో సంబంధమున్న వర్గాలు మాత్రం ఎప్పటిమాదిరిగానే.. మర్యాదపూర్వక సమావేశం అంటూ కొట్టిపడేశాయి. గంగూలీతో పలు సమస్యలపై చర్చించినట్లు సమావేశం అనంతరం గవర్నర్ ధన్‌ఖర్‌ మీడియా చెప్పారు. ఈడెన్ గార్డెన్స్ సందర్శించాలి కోరిన గంగూలీ ఆహ్వానానికి అంగీకరిస్తున్నానని తెలిపారు. కొత్త కార్యక్రమాలు ఏవీ లేనప్పటికీ ఈడెన్‌ గార్డెన్స్‌ను సందర్శించాల్సిన అవసరం ఏమిటో.. ఆయన ఆహ్వానించడం.. ఈయన ఒప్పుకోవడం ఏమిటో.. అంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో దాదా చేరితే కొత్త ఊపు వస్తుందని, ఆయన అభిమానులు, ఆయన వర్గీయులు బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుకు వస్తారని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అంతకు కొన్ని రోజుల ముందు రాజకీయ గందరగోళం తీవ్రమైంది. ఇటీవల హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తృణమూల్‌ పార్టీకి చెందిన సువేందు అధికారితోపాటు 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో తనకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పరిశీలకులను నియమించిన బీజేపీ

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పరిశీలకులను నియమిస్తున్నది. కోల్‌కతా జోన్‌కు సోవన్ ఛటర్జీని పరిశీలకుడిగా నియమించిన బీజేపీ అధిష్ఠానం.. డెబ్జిత్ సర్కార్‌ను కన్వీనర్‌గా నియమించింది. బైసాకి బెనర్జీ, సంఖుదేబ్ పాండాలను కోకన్వీనర్లుగా చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ జిల్లాల్లో కూడా పరిశీలకులు, కన్విన్సర్ల నియమకాలు చేపట్టారు. జనవరి చివరికల్లా నియోజకవర్గాల వారీగా ముగ్గురు, నలుగురితో కూడిన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి అధిష్ఠానం ఆమోదం కోసం పంపేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాకుండా చాలా ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని, అయితే వారిని ప్రకటించకుండా ఆయా నియోజకవర్గాల్లో పనులు చేసుకునేలా పురమాయించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

అమ్మకానికి స్వచ్ఛమైన గాలి.. బాటిల్‌ ధర ఎంతంటే..?

900 బిలియ‌న్ డాలర్ల‌ బిల్లుపై ట్రంప్ సంత‌కం..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.