శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 07:27:57

అయోధ్య భూమిపూజకు ముస్లింలు

అయోధ్య భూమిపూజకు ముస్లింలు

అయోధ్య : బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్యలో రామాలయ నిర్మాణం... ఎన్నో ఏండ్లుగా అత్యంత వివాదాస్పదమైన ఈ అంశాలు హిందూ ముస్లింల మధ్య కనిపించని ఒక అడ్డుగోడలా ఉండేవి. ఆలయ నిర్మాణం, స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. హిందూ-ముస్లిం భాయీ భాయీ అన్న  మాటను నిజం చేస్తూ ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం భూమిపూజలో పాల్గొనడానికి వెళ్తున్నారు. చాలా మంది ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని భావిస్తున్నారు. తమ మూలాలు హిందూ మతంలో ఉన్నాయని, తమ పూర్వీకులు రాముడిని పూజించారని కొందరు ముస్లిం సోదరులు చెప్పడం విశేషం.

ఆగస్టు 5న అయోధ్యలో ఆలయ భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫయాజ్‌ ఖాన్‌ కాలినడకన అయోధ్యకు బయల్దేరారు. ఆలయ నిర్మాణానికి ఇటుకలను కూడా మోసుకెళ్తున్నారు. ఫయాజ్‌ ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు అయోధ్యకు వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారిలో రాజా రయీస్‌, వాసీ హైదర్‌, హజీ సయీద్‌, జంషెడ్‌ ఖాన్‌, ఆజం ఖాన్‌ కూడా ఉన్నారు. వీరు తమ మూలాలు హిందువులతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. తమ పూర్వీకులు రాజపుత్రులని, వారు తర్వాత కాలంలో ఇస్లాంను స్వీకరించారని తెలిపారు. రాముడిని తాము ‘ఇమామ్‌-ఎ-హింద్‌'గా భావిస్తామన్నారు. హిందూ సోదరుల్లాగానే తాము కూడా ఉత్సవాల్లో పాలుపంచుకుంటామని చెప్పారు.

మరోవైపు అయోధ్యలో ఉన్న మసీదులు మతసామరస్యాన్ని పెంచుతాయని స్థానిక కార్పొరేటర్‌ హజీ అసద్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డారు. కాగా, రామాలయం కొత్త డిజైన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ నెల 18న ఆమోదం తెలిపింది. అంతకుముందు డిజైన్‌ కన్నా 20 అడుగులు ఎత్తుతో(161 అడుగులు) ఆలయాన్ని నిర్మించనున్నారు. అదనంగా మూడు మంటపాలు నిర్మిస్తున్నట్టు ఆలయ ప్రధాన శిల్పి సీఎస్‌ సోంపూరా తెలిపారు. స్తంభాల సంఖ్యను కూడా 160 నుంచి 366కు పెంచినట్టు వెల్లడించారు.


logo