మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 19:11:14

అయోధ్య భూమిపూజకు ఎంఐఎం అధినేత

అయోధ్య భూమిపూజకు ఎంఐఎం అధినేత

హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమ ఆహ్వానం అందింది. ఆగస్టు 5న అయోధ్యలో నిర్వహించే రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మోదీ పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమానికి ఓవైసీ కూడా హాజరు కావాలని తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆహ్వానించారు. గత కొద్ది రోజుల క్రితమే అసదుద్దీన్‌ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య భూమి పూజలో ఎలా పాల్గొంటారంటూ ట్విట్టర్ లో  తీవ్రమైన విమర్శలు కురిపించారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓవైసీని పిలవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం లేవనెత్తిన అభ్యంతరాలు చాలా చిన్నవని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మతాన్ని ఆచరించే స్వేచ్ఛను కల్పించిందన్నారు. నిరాధారమైన ఆరోపణలు, అభ్యంతరాలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ కూడా దానికి మినహాయింపు కాదు. భారత పౌరుడిగా తన సొంత మత హక్కులు, ఆచారాలను నిర్వహించడానికి ఇతరుల కంటే ఆయనకే ఎక్కువ అధికారం ఉంది. ఆ హక్కును  వినియోగించుకుంటారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబో తున్నది. మోది అద్భుతమైన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. శ్రీరాముడి జన్మస్థానమైన భవ్య రామ్ మందిర్ వద్ద పూజలు మొదలవుతాయి. ఈ విషయంలో బీజేపీకి చాలా గర్వంగా ఉంది' అని కృష్ణ సాగర్ రావు అన్నారు. 


logo