కాళ్లకు కర్టెన్ చుట్టుకుని ఎగ్జామ్ రాసిన యువతి
గౌహతి, సెప్టెంబర్ 17: షార్ట్ ధరించిందని 19 ఏండ్ల ఓ యువతిని ఇన్విజిలేటర్ ప్రవేశ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ఆమె అక్కడే ఉన్న పరదాను కాళ్లకు చుట్టుకుని పరీక్ష రాసింది. ఈ ఘటన అసోం సోనిట్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌లోని గిరిజానంద చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో చోటుచేసుకున్నది. అసోం అగ్రికల్చర్ యూనివర్సిటీ.. ఈ నెల 15న తేజ్‌పూర్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించింది. జుబ్లీ తములి అనే యువతి పరీక్ష రాసేందుకు తండ్రితో కలిసి వచ్చింది. ‘అడ్మిట్ కార్డు, ఇతర పత్రాలు పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కానీ, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తుండగా ఇన్విజిలేటర్ ఆపారు. షార్ట్ ధరిస్తే అనుమతించబోమని చెప్పారు. ఆ విషయం అడ్మిట్ కార్డులో ఎందుకు లేదని ప్రశ్నించాను. ఆ విషయం మీరే తెలుసుకోవాలని సమాధానం ఇచ్చారు. ప్యాంట్ కొనుక్కొని రావాలని మా నాన్నను మార్కెట్‌కు పంపాను’ అని జుబ్లీ తెలిపింది. ఆలస్యం అవుతుండటంతో తోటి విద్యార్థుల సలహా మేరకు అక్కడే ఉన్న కర్టెన్ను కాళ్లకు చుట్టుకుని పరీక్ష రాసింది. ఇది అత్యంత అవమానకరమైన అనుభవమని ఆమె పేర్కొన్నది. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వర్సిటీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.