గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 17:12:10

మారిన ఎంఎస్‌ఎంఈ నిర్వచనం.. పెట్టుబడి పరిమితుల సవరణ

మారిన ఎంఎస్‌ఎంఈ నిర్వచనం.. పెట్టుబడి పరిమితుల సవరణ

ఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం మారింది. కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తూ ఎంఎస్‌ఎంఈ నిర్వచనం నేటి నుంచి మారినట్లుగా తెలిపారు. నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా పేర్కొన్నారు.  

ఏడాదిపాటు రుణాలపై తిరిగి చెల్లింపులు చేయనక్కర్లేదు...

పీఎం గరీభ్‌ కల్యాణ్‌ పథకం కింద పేదలు, వలస కూలీల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసినట్లు తెలిపారు. 41 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాదారుల అకౌంట్‌లలో రూ. 52,606 కోట్లు జమచేసినట్లు చెప్పారు. అదేవిధంగా రూ. 18 వేల కోట్ల ఇన్‌కం టాక్స్‌ను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. దీంతో 40 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్దిచేకూరినట్లు వివరించారు.  ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర, గృహ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్లు పూచీకత్తు లేకుండా రుణాలుగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈలోని ఉద్యోగులకు భద్రత కల్పించేందుకూ సైతం ఉపయోగకరమన్నారు. 12 నెలల వరకు రుణాలపై తిరిగి చెల్లింపులు చేయనక్కర్లేదన్నారు. ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. 


logo