బుధవారం 15 జూలై 2020
National - Jun 27, 2020 , 01:16:24

జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఈనెల 30 నాటికి అన్‌లాక్‌-2 మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం వచ్చే 15 వరకు కొనసాగుతుందని విమానయాన నియంత్రణ సంస్థ ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌' (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. అయితే అంతర్జాతీయ కార్గో (సరుకు రవాణా) సర్వీసులు, డీజీసీఏ అనుమతినిచ్చిన ప్రత్యేక విమానాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఎంపిక చేసిన రూట్లలో పలు సర్వీసులకు అనుమతించే అవకాశం ఉన్నదని తెలిపింది. కరోనా నియంత్రణలో భాగంగా గత మార్చిలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దేశీయ విమాన సర్వీసులు మాత్రం మే 25న పునఃప్రారంభమయ్యాయి. కాగా, కరోనాకు ముందు నడుపుతున్న విమానాల్లో 45% విమానాలను నడిపేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం శుక్రవారం అనుమతించింది.   త్వరలో మరిన్ని ఆంక్షలు సడలింపు! దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికీ కేంద్రం త్వరలో మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 30లోగా అన్‌లాక్‌-2 మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు సమాచారం. జూలై మధ్య నుంచి ఎంపిక చేసిన కొన్ని రూట్లలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉన్నది.


logo