ఆదివారం 31 మే 2020
National - May 14, 2020 , 16:33:03

రైతులు, వలస కూలీలు, చిన్న వ్యాపారులకు ప్యాకేజీలు

రైతులు, వలస కూలీలు, చిన్న వ్యాపారులకు ప్యాకేజీలు

ఢిల్ల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వలస కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులపై దృష్టి పెట్టాం. సన్నకారు రైతులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాం. 25 లక్షల మంది కిసాన్‌ కార్డుదారులకు రూ.25 వేల కోట్ల రుణాలు అందించాం. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మూడు కోట్ల మంది రైతులకు రూ.86,600 కోట్లు చౌకగా రుణాలు ఇచ్చాం.

వ‌ల‌స కూలీల‌కు రోజుకు మూడు పూట‌ల అన్నం..

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31వ తేదీ 2021 వరకు వడ్డీ రాయితీ పొడగింపు. వ్యవసాయ రుణాలపై మూడు నెలల వరకు మారిటోరియం. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగాల కల్పన అంశాలపై ప్యాకేజీ ప్రకటించాం.  గ్రామీణ మౌళిక రంగానికి రూ. 4200 కోట్లు. పట్టణ పేదలు, వలస కూలీలకు అన్నపానీయాల కోసం ఏర్పాట్లు చేశాం. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లుకు రూ.11 వేల కోట్లు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ జరిగింది. రోజుకు మూడు పూటలు అన్నపానీయాలకు కృషి చేస్తున్నాం. గ్రామీణ బ్యాంకులు, సహాకార బ్యాంకులకు మార్చిలో రూ. 29500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసిందని తెలిపారు.

10 మంది ఉంటే.. ఈఎస్ఐ

పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. వలస కూలీలకు ఉపాధి కోసం మే 13 నాటికి రూ.13 కోట్ల పనిదినాలు కల్పించాం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ర్టాలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ. 6700 కోట్లు అందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద రూ.10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా జరిగింది. వలస కార్మికులు ఉన్నచోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉపాధి పొందవచ్చు. కనీస వేతనం 30శాతం మందికే అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం. దేశమంతా ఒకే విధంగా కనీస వేతనం ఉండేలా చూస్తాం. వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులు బాటు కల్పించాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకునే అవకాశం ఉంటుంది. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నీంటికీ ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుంది. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ర్టాలకు రూ.11,0002 కోట్లు ఇప్పటికే అందించాం.

దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు..

 12 వేల స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల మాస్క్‌లు, లక్షా 20 వేల లీటర్ల శానిటైజర్ తయారు చేశాయి. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేశాం. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పన బియ్యం, గోదుమలు, కిలో పప్పు పంపిణీ చేస్తున్నాం. రేషన్‌ కార్డులు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు, తీసుకోవచ్చు. వలస కార్మికులు ఎక్కుడన్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాలపంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించాం. రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఆగస్టు నాటికి ఒకే దేశం... ఒకే కార్డు అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది. 2021 మార్చి 31 నాటికి వందశాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ చేస్తాం. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానం ప్రజా పంపిణీలో కొత్త విప్లవం తీసుకొస్తుంది. వలస కార్మికులు, పట్టణ పేదల కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నాం. పట్టణ పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహాల నిర్మాణం చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే తగిన సాయన్ని కేంద్రం అందిస్తుంది. వలస కార్మికుల నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తాం. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముద్ర పథకం కింద రూ.50 వేల లోపు శిశు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ. మారిటోరియం అనంతరం ముద్ర రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ అందిస్తామని తెలిపారు. 


logo