శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 21:09:47

13 ఏండ్లకే ఇంటర్‌ పాస్‌ అయ్యింది

13 ఏండ్లకే ఇంటర్‌ పాస్‌ అయ్యింది

భోపాల్‌ : కరోనా మహమ్మారితో ఇటీవల తండ్రిని కోల్పోయిన మధ్యప్రదేశ్‌ రాష్ర్టం ఇండోర్‌కు చెందిన బాలిక 13 ఏండ్లకే ఇంటర్‌ పాస్‌ అయ్యింది. ఈమె పదో తరగతి పరీక్షల తరువాత నేరుగా ఇంటర్‌ పరీక్షలు రాసిన మొదటి విద్యార్థిని కావడం విశేషం. 

సోమవారం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటర్‌ బోర్డు ఫలితాలను ప్రకటించగా తనిష్క కామర్స్‌ విభాగంలో 62.8 శాతం మార్కులు సాధించింది. ప్రైవేట్ విద్యార్థినిగా పరీక్షలకు హాజరైన తనిష్క ఇంగ్లీష్‌, హిందీ సబ్జెక్టుల్లో కూడా మెరుగైన మార్కులు సాధించింది. ఈ సందర్భంగా తనిష్క తల్లి అనుభా చంద్రన్‌ మాట్లాడుతూ "మేము భోపాల్‌లో చాలాసార్లు ప్రభుత్వ అధికారులను కలిశాం. పదో తరగతి తరువాత నేరుగా 12వ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి తనిష్కకు ప్రత్యేక అనుమతి ఇవ్వమని వారిని ఒప్పించాం’’ అన్నారు. 

తనిష్క తండ్రి సుజిత్‌ జూలై 2న కరోనావైరస్ సోకి మృతిచెందారు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో పదో తరగతి పరీక్షలు రాసిన తరువాత నేరుగా ఇంటర్‌ పరీక్షలను క్లియర్‌ చేసిన తనిష్క మధ్యప్రదేశ్‌ రాష్ర్టంలోనే మొదటి విద్యార్థినిగా రికార్డు సృష్టించింది. ఇతర పిల్లల్లా తనిష్క ప్రీ-ప్రైమరీ తరగతులకు హాజరు కాలేదు. ఆమె కేవలం మూడు సంవత్సరాల వయస్సులో నేరుగా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరిందని తల్లి అనుభా తెలిపారు. 

‘‘నా కుమార్తె 2015 నుంచి ఇంటి నుంచే చదువుకుంటోంది. సరిగ్గా బోధిస్తే ఏ బిడ్డ అయినా పాఠశాలలో కంటే ఇంట్లో ఉండి కూడా మంచి జ్ఞానాన్ని పొందగలడని, అనేక నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నా భర్త భావించేవాడు’’ అని ఆమె చెప్పారు. 

తనిష్క మాట్లాడుతూ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌) అధికారి కావాలని, నృత్యంలో పీహెచ్‌డీ సంపాదించాలనేది తన కల అని తెలిపింది. తదుపరి బి.కామ్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరుకావడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నానని తనిష్క పేర్కొన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo