శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 27, 2020 , 02:44:27

హింస పరిష్కార మార్గం కాదు!

హింస పరిష్కార మార్గం కాదు!
  • ఆ మార్గాన్ని ఎంచుకున్న వారుజనజీవన స్రవంతిలోకి రండి
  • ఈశాన్యంలో తిరుగుబాటు పరిస్థితులు దిగివచ్చాయి
  • శాంతియుత చర్చలే అందుకు కారణం
  • మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 26: హింస ఎన్నటికీ ఏ సమస్యనూ పరిష్కరించలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయుధాలు, హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న వారు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడంలో దేశ సామర్థ్యాలపై విశ్వాసముంచాలని వారికి సూచించారు. నవభారత నిర్మాణానికి అందరూ కలిసిరావాలని కోరారు. ఈ ఏడాది తొలి మాసాంతపు ‘మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సాధారణంగా ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నా, గణతంత్ర వేడుకల నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు మార్చారు. ఈశాన్య భారతంలో తిరుగుబాటు పరిస్థితులు దిగివచ్చాయని ప్రధాని చెప్పారు. అసోంలో 644 మంది మిలిటెంట్లు ఆయుధాలతో సహా లొంగిపోయారని తెలిపారు. గత ఏడాది త్రిపురలో 80 మంది హింసామార్గాన్ని వీడారన్నారు. 


నిజాయితీ, శాంతియుత చర్చలతో సమస్యలకు పరిష్కారం చూపడమే ఈశాన్యంలో తిరుగుబాటు తగ్గడానికి ప్రధాన కారణమని మోదీ వివరించారు. 21వ శతాబ్దం విజ్ఞానం, సైన్స్‌, ప్రజాస్వామ్యపు యుగమని, హింస వల్ల జీవనం మెరుగైనట్లు ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. త్రిపురలోని బ్రూ-రియాంగ్‌ శరణార్థుల పునరావాసం గురించి ప్రస్తావిస్తూ.. దీనిపై కేంద్రం, త్రిపుర, మిజోరం మధ్య కుదిరిన ఒప్పందం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఈ ఒప్పందంతో 25 ఏండ్ల బాధాకరమైన అధ్యాయానికి ముగింపు లభించిందన్నారు. జాతుల వైరం కారణంగా బ్రూ-రియాంగ్‌ తెగ ప్రజలు మిజోరంను వీడి త్రిపురలో తలదాచుకున్నారని చెప్పారు. 34 వేల మంది బ్రూ శరణార్థులకు త్రిపురలో పునరావాసం కల్పిస్తామని, ఇందుకోసం రూ.600 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 


జల్‌శక్తిలో జనభాగస్వామ్యం..

ప్రజల భాగస్వామ్యంతో జల్‌శక్తి ఉద్యమం విజయవంతంగా నడుస్తుండడం సంతోషకరమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో సరస్సులు, నీటిగుంటలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు.   


వచ్చే నెల్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌..

ఈ నెల 22న ముగిసిన మూడో విడుత ‘ఖేలో ఇండియా’ క్రీడల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ‘ ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొంటున్న పిల్లల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ కూడా నిర్వహించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో ఒడిశాలోని భువనేశ్వర్‌, కటక్‌లలో ఇవి జరుగుతాయి’ అని ప్రధాని వివరించారు. 


ప్రజల అవార్డులుగా ‘పద్మా’లు

పద్మ అవార్డులు ఇప్పుడు ప్రజల అవార్డులుగా మారాయని మోదీ అన్నారు. గతంలో కొందరు మాత్రమే నిర్ణయం తీసుకునేవారని, ఇప్పుడు ప్రజలే నిర్ణేతలన్నారు. పద్మ అవార్డులకు ఈసారి 46వేలకుపైగా నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. గగన్‌యాన్‌ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. 2022లో గగన్‌యాన్‌ సాకా రం కానుందని, భారత శాస్త్ర సాంకేతిక రంగం లో ఇది చారిత్రక అధ్యాయంగా నిలిచిపో నుందని ప్రధాని పేర్కొన్నారు.


logo