శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 09:37:27

గాయపడ్డ బాలుడిని 1300 కి.మీ. మోసుకెళ్లారు..

గాయపడ్డ బాలుడిని 1300 కి.మీ. మోసుకెళ్లారు..

న్యూఢిల్లీ : వలస కార్మికుల కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎర్రటి ఎండలో కాళ్లకు బొబ్బలు వచ్చినప్పటికీ.. తమ గమ్యస్థానం చేరేందుకు కాలినడక కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కాలినడకలో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్ని కావు. ఆకలితో అలమటిస్తూ.. వేల కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. కొంతమంది వలస కార్మికుల బాధలు అయితే గుండెల్ని పిండేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి చెందిన ఓ కుటుంబం.. పంజాబ్‌లోని లుధియానాకు వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా వారికి ఉపాధి లేకపోవడంతో.. సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయం కావడంతో.. నడవలేడు. మరి ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు.. ఓ మంచాన్ని కావడిలా మార్చారు. మంచంపై బాలుడిని పడుకోబెట్టి.. సుమారు 1300 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. 

లుధియాన నుంచి సింగ్రౌలికి వెళ్లేందుకు వారికి 15 రోజుల సమయం పట్టింది. ఈ సమయంలో.. వారికి కాళ్లకు చెప్పులు లేవు. నిప్పులు కక్కే ఎండకు వారి కాళ్లకు బొబ్బలు వచ్చాయి. చివరకు యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు వద్ద ఆ కుటుంబం కష్టాలను చూసిన పోలీసులు చలించిపోయారు. వారికి ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపించారు. 

ఈ సందర్భంగా కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పిల్లలతో పాటు 17 మంది లుధియానా నుంచి సింగ్రౌలికి కాలినడకన బయల్దేరామని తెలిపాడు. చివరకు కాన్పూర్‌లో పోలీసులు తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదిహేను రోజుల సమయంలో ఏ ఒక్క రోజు కూడా కడుపునిండా తిండి తినలేదు. ఆకలితో అలమటిస్తున్నామని తెలిపాడు ఆ వ్యక్తి. 


logo