బుధవారం 08 జూలై 2020
National - May 04, 2020 , 01:32:35

కరోనా కేసులు 40263

కరోనా కేసులు 40263

  • దేశంలో ఒక్క రోజే 2,487 కేసులు.. 83 మరణాలు
  • కేసుల డబ్లింగ్‌ 12 రోజులకు
  • మనవద్దే మృతుల రేటు తక్కువ
  • కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడి
  • నేటి నుంచి పలు సడలింపులు

న్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. కేసుల సంఖ్య 40 వేలు దాటింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 2,487 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే రికార్డు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది వైరస్‌ కారణంగా మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 1,306కు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 10,886 మంది కొవిడ్‌-19 బారి నుంచి కోలుకున్నారని, 28,070 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది. దేశంలో కరోనా మరణాలు రేటు 3.2 శాతంగా ఉన్నదని.. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. గత 14రోజుల కిందట కేసుల రెట్టింపు 10.5 రోజులు ఉండగా.. ప్రస్తుతం 12 రోజులకు చేరిందన్నారు. ఇప్పటివరకు దేశంలో 10,46,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. 

రాష్ర్టాల్లో సడలింపుల పర్వం!

సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 మొదలుకానున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు మరికొన్ని ఆంక్షల్ని సడలించాయి. మద్యం దుకాణాలకు అనుమ తినివ్వడం,  పెండ్లి వేడుకలకు 20 మందికి పైగా, అంత్యక్రియలకు 20 మందిని అనుమ తించడం, అత్యవసర సరుకుల రవాణాకు ఈ-కామర్స్‌ సంస్థలకు అనుమతి, కార్లలో ఇద్దరు లేదా ముగ్గురు, ద్విచక్ర వాహనంపై ఒక్కరికి అనుమతినివ్వడం వంటివి ఉన్నాయి. 

ఢిల్లీ: గ్రీన్‌ జోన్లలో ఉన్న దుకాణాలు సరి-బేసి విధానంలో తెరుస్తారు. 33 శాతం ఉద్యోగులతో ప్రైవేటు సంస్థలు నడుస్తాయి. 

కేరళ: గ్రూప్‌ ఏ, బీ (50 శాతం మంది), గ్రూప్‌ సీ, డీ (33 శాతం మంది) ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలకు అనుమతి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు గ్రీన్‌ జోన్లలో దుకాణాలకు అనుమతి. అంతర్‌జిల్లా పరిధిలో ప్రయాణాలు చేయడానికి ఇద్దరికి అనుమతి. కాగా ఆదివారం అన్నింటినీ మూసివేయాలి. వాహనాలు కూడా బయటకు రాకూడదు.

ఉత్తరప్రదేశ్‌: గ్రీన్‌ జోన్లలో 50 శాతం సామర్థ్యంతో ప్రజా రవాణాకు అనుమతి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ మాస్కులు ధరించాలి. ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకూడదు. 

మహారాష్ట్ర: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సెలూన్లకు(రెడ్‌ జోన్‌ కాకుండా) అనుమతి. అయితే, రెడ్‌ జోన్లలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 33 శాతం మంది మాత్రమే హాజరవ్వాలి. 

మేఘాలయ: 33 శాతం ఉద్యోగులతో ప్రభుత్వ (గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ), ప్రైవేటు సంస్థలకు అనుమతి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు.

పంజాబ్‌: గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంటల వరకు అనుమతి. మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా. 

చండీగఢ్‌: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని దుకాణాలకు అనుమతి.

ఒడిశా: 50 శాతం ఉద్యోగులతో కార్యాలయాలకు అనుమతి. 


logo