బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:25:55

రికవరీ @ 10,00,000

రికవరీ @ 10,00,000

  • దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 
  • రికవరీ రేటులో అగ్రదేశాల కంటే ముందంజ
  • ప్రతి పదిమందిలో ఏడుగురు వైరస్‌పై విజయం 
  • మరణాలరేటులో ప్రపంచ సగటు కంటే ఎంతో మెరుగు

ఎక్కడో 3,500 కిలోమీటర్ల దూరంలో చైనాలో వెలుగు చూసిన వైరస్‌ మనదాకా వస్తుందా అనుకున్నాం. రావడమే కాదు మొండిగా తిష్ఠ వేసింది. అయితే, భయపడటమంటే మరణానికి ఆహ్వానం పలుకడమేనన్న విషయం భారతీయులకు తెలియంది కాదు. అందుకే భయాల్ని పక్కనబెట్టి ఆత్మైస్థెర్యంతో, వైద్యసిబ్బంది, ప్రభుత్వాల సహకారంతో కరోనాకు ముకుతాడు వేశారు. దేశంలో కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య గురువారానికి 10 లక్షలు దాటింది. అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్‌కంటే మనదేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది.

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య (రికవరీ రేటు) గణనీయంగా పెరుగుతున్నది. దేశంలో 15 లక్షలకు పైగా వైరస్‌ కేసులు గురువారం నమోదుకాగా, ఇందులో 10.20 లక్షల మంది (64.4 శాతం) కోలుకున్నారు. అగ్ర దేశాలు అమెరికా, బ్రిటన్‌లతో పోలిస్తే ఇది అధికం. ప్రపంచ దేశాల సగటు రికవరీ (62.31 శాతం)తో పోల్చి చూసినా కూడా మన రికవరీ రేటు ఎక్కువగా ఉన్నది. మరోవైపు, వైరస్‌ మరణాల్లో కూడా భారత్‌ ప్రపంచ సగటు (3.89 శాతం) కంటే మెరుగ్గా ఉన్నది. మనదగ్గర వైరస్‌ మరణాలు 2.21 శాతంగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌, మెక్సికో, బ్రెజిల్‌ కంటే మన దగ్గరే వైరస్‌ మరణాలు తక్కువ. 

అధైర్య పడొద్దు!

దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. అప్పటి నుంచి వైరస్‌ వ్యాప్తి, రికవరీ రేటు, మరణాల రేటును క్షుణ్ణంగా పరిశీలిస్తే మహమ్మారిపై విజయం సాధించడం అంత కష్టమేమీ కాదన్న విషయం అర్థమవుతున్నది. ఏప్రిల్‌ 1నాటికి దేశంలో 1,834 మందికి వైరస్‌ సోకింది. అప్పట్లో వీరిలో కేవలం 144 మంది మాత్రమే కోలుకోగా మిగిలినవారు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అంటే రికవరీ రేటు 7.85 శాతం మాత్రమే. వైద్య సిబ్బంది కృషి, ప్రజల్లో అవగాహన పెరగడంతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై 1 నాటికి దేశంలో 5.85 లక్షల మందికి వైరస్‌ సోకింది. వీరిలో 3.48 లక్షల మంది కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 59.48 శాతం. ప్రస్తుతం ఇది 64.4 శాతానికి చేరుకున్నది.

కోలుకుంటున్న ప్రధాన నగరాలు!

కరోనాకు వ్యతిరేకంగా దేశ ప్రజలు సామూహిక రోగనిరోధకశక్తిని (హెర్డ్‌ ఇమ్యూనిటీని) సంతరించుకుంటున్నారు. మొన్న ఢిల్లీ.. నిన్న ముంబైలో నిర్వహించిన సెరో-సర్వేలో ఇదే విషయం బయటపడింది. ఢిల్లీ జనాభాలో దాదాపు నాలుగో వంతు మందికి (47 లక్షల మందికి), ముంబై జనాభాలో దాదాపు 40 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు క్రమంగా కరోనా గుప్పిట నుంచి బయటపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారత్‌ వంటి అధిక జనాభా ఉన్న దేశం హెర్డ్‌ఇమ్యూనిటీపైనే ఆధారపడటం క్షేమకరం కాదని, వ్యాక్సిన్‌ ద్వారా వైరస్‌ను ఎదుర్కోవడమే శ్రేయస్కరమని  కేంద్రం స్పష్టం చేసింది.

- నేషనల్‌ డెస్క్‌


logo