శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 01:09:47

‘లక్ష’ భారత్‌!

‘లక్ష’ భారత్‌!

  • దేశంలో కరోనా కేసులు 1,00,096
  • రాష్ర్టాల గణాంకాల ఆధారంగా పేర్కొన్న పీటీఐ
  • 96,169గా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
  • 24 గంటల్లో 5,242 కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మరణాలు కూడా మూడు వేలను దాటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గణాంకాల మేరకు సోమవారం నాటికి వైరస్‌ కేసుల సంఖ్య 1,00,096కు చేరిందని, మరణాల సంఖ్య 3,078గా ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించిన గణాంకాల ప్రకారం మాత్రం కేసుల సంఖ్య 96,169. మృతుల సంఖ్య 3,029. కానీ, రాష్ట్రప్రభుత్వాలు తెలిపిన లెక్కలను అనుసరించి సోమవారం రాత్రి పీటీఐ వార్తాసంస్థ.. దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటిందని ప్రకటించింది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అమెరికా (14.9 లక్షల కేసులు) తొలిస్థానంలో ఉండగా భారత్‌ 11 స్థానంలో ఉన్నది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. 24 గంటల్లో 157 మంది మరణించారు. రోగుల రికవరీ (కోలుకుంటున్న వారు) 38.29 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు వైరస్‌ ప్రభావిత రాష్ర్టాల్లో మహారాష్ట్ర టాప్‌లో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 33 వేలకుపైగా కేసులు, 1,249 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (11,760 కేసులు, 81 మరణాలు), గుజరాత్‌ (11,746 కేసులు, 694 మరణాలు), ఢిల్లీ (పది వేలకుపైగా కేసులు, 160 మరణాలు) ఉన్నాయి.


logo