శనివారం 23 జనవరి 2021
National - Dec 20, 2020 , 02:02:54

భారత్‌ @ కోటి

భారత్‌ @ కోటి

  • 1,45,136కి చేరిన మరణాల సంఖ్య
  • ఇప్పటివరకు 95.50 లక్షల మంది రికవరీ
  • సెప్టెంబర్‌ మధ్య నుంచి తగ్గిన కరోనా ఉద్ధృతి
  • సెకండ్‌ పీక్‌ ఉండకపోవచ్చంటున్న నిపుణులు
  • శరవేగంగా వ్యాక్సినేషన్‌: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 19: భారతదేశం ఓ విషాదకర మైలురాయిని దాటింది. దేశంలో కరోనా కేసులు శనివారం కోటి దాటాయి. కొత్తగా 25,152 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కి చేరింది. కరోనా కాటుకు మరో 347 మంది బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1,45,136కు పెరిగింది. ఇప్పటివరకు 95.50 లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.45 శాతానికి దిగివచ్చింది. ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులు (కరోనాబారినపడి చికిత్స తీసుకుంటున్నవారు) ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 3.08 శాతం. సెప్టెంబర్‌ మధ్యనాటికి కేసులు గరిష్ఠ స్థాయిని చేరగా, అనంతరం తగ్గుముఖం పట్టాయి. దేశంలో జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 10న కర్ణాటకలో తొలి మరణం రికార్డయింది.  అత్యధికంగా మహారాష్ట్రలో 18.88 లక్షల కేసులు నమోదుకాగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక(9.07 లక్షలు), ఆంధ్రప్రదేశ్‌ (8.77 లక్షలు), తమిళనాడు (8.04 లక్షలు), కేరళ (6.9 లక్షలు) ఉన్నాయి. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనా రికవరీలో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ ఉన్నది. కేసుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా, మన దేశం రెండోస్థానంలో ఉన్నది. మరణాల విషయంలో భారత్‌ మూడోస్థానంలో ఉండగా.. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

తీవ్రదశను దాటేశాం..

దేశంలో కరోనా సెకండ్‌ పీక్‌ ఉండకపోవచ్చని, ఒకవేళ వచ్చినా మొదటి దానంత బలంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తీవ్రదశను దాటేశామని, వచ్చే కొన్నేండ్లలో స్వల్పస్థాయిలో వైరస్‌ వ్యాప్తి ఉండొచ్చని పేర్కొంటున్నారు. టీకాతో దీనికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు.

దేశంలో ఎంపికచేసిన ప్రజలందరికీ కరోనా టీకాలు వేసేందుకు వేగవంతమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు.  కొవిడ్‌-19పై నియమించిన ఉన్నతస్థాయి మంత్రుల బృందం (జీవోఎం) 22వ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అయితే నిర్లక్ష్యం తగదని చెప్పారు. logo