శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Aug 07, 2020 , 10:13:36

దేశంలో ఒకేరోజు 62వేల‌కు పైగా కేసులు

దేశంలో ఒకేరోజు 62వేల‌కు పైగా కేసులు

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. ప్రాణాంత‌క వైర‌స్ అన్ని ప్రాంతాల‌కు  విస్త‌రించ‌డంతో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో గ‌త‌ తొమ్మిదోరోజులుగా 52 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా అత్య‌ధికంగా 62 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 

గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 62,538 మందికి కొత్త‌గా క‌రోనా వైర‌స్ సోకింది. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,27,075కు చేరాయి. ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 886 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 

తాజాగా న‌మోద‌వుతున్న పాజ‌టివ్ కేసుల్లో దాదాపు 38 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. జూలై నెల‌లో దేశ‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా 19 శాతంగానే ఉన్న‌ది.       

దేశంలో ఆగ‌స్టు 6 వ‌ర‌కు 2,27,24,134 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని, నిన్న ఒకేరోజు 5,74,783 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.