సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 09:50:31

దేశంలో కరోనా స్వైర విహారం.. ఒకేరోజు 34,884 కేసులు

దేశంలో కరోనా స్వైర విహారం.. ఒకేరోజు 34,884 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు లేని ప్రాంతం లేదనట్లు పరిస్థితి తయారయ్యింది. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 32 వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజుకూడా 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,38,716కు చేరింది. ఇందులో 3,58,692 యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనా బారినపడిన మరో 6,53,751 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వైరస్‌ వల్ల కొత్తగా 671 మంది మరణించడంతో, మొత్తం కరోనా మృతులు 26,273కు పెరిగారు. 


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,41,94,139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,99,416 మంది మరణించగా, 84,70,275 మంది బాధితులు కోలుకున్నారు. మరో 51,24,448 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 34,956 కరోనా కేసులు నమోదవగా, 687 మంది మరణించారు.   

ఇప్పటివరకు 1.34 కోట్ల కరోనా పరీక్షలు

జూలై 17 వరకు దేశవ్యాప్తంగా 1,34,33,742 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 3,61,024 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.


logo