సోమవారం 25 మే 2020
National - Mar 30, 2020 , 00:46:03

వెయ్యి దాటిన కేసులు

వెయ్యి దాటిన కేసులు

-ఒక్కరోజే 106 నమోదు

-దేశంలో 27కు పెరిగిన కరోనా వైరస్‌ మృతులు

న్యూఢిల్లీ: దేశంలో వైరస్‌ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. ఆదివారం 106 కొత్త కేసులు నమోదు కాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,024కు చేరింది. ఒక్కరోజే 8 మంది మరణించగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 27కు పెరిగింది. ఢిల్లీలో ఆదివారం కొత్తగా 23 కేసులు నమోదుకాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 72కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 186, ఆ తర్వాత కేరళలో 182 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్ర (6) టాప్‌లో ఉండగా, గుజరాత్‌ (5), కర్ణాటక (3), మధ్యప్రదేశ్‌ (2), ఢిల్లీ (2), జమ్ముకశ్మీర్‌ (2), కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కో మరణం నమోదైనట్లు తెలిపింది. 

స్పైస్‌జెట్‌ పైలట్‌కు పాజిటివ్‌

స్పైస్‌జెట్‌కు చెందిన ఓ పైలట్‌కు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఆ సంస్థ తెలిపింది. ఆయన ఈ నెల 21 నుంచి ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఆ పైలట్‌ను కలిసిన సిబ్బందిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు తెలిపింది. మరోవైపు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎయిర్‌ ఇండియా పైలట్ల సంఘం డీజీసీఏను కోరింది. ఇరాన్‌ నుంచి ఇటీవల ఢిల్లీ చేరిన 275 మంది భారతీయులను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీ వైద్య కేంద్రానికి తరలించారు. మాస్కులు, గ్లౌవ్స్‌, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ‘నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ’ (ఎన్‌పీపీఏ) కోరింది. 

పీఎం కేర్స్‌ విరాళాలు సీఎస్‌ఆర్‌ కిందకే..

కార్పొరేట్‌ సంస్థలు పీఎం కేర్స్‌ నిధికి ఇచ్చే విరాళాలను సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) వ్యయాలుగా పరిగణిస్తామని కేంద్రం తెలిపింది.


logo