బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 22:06:34

కాలుష్యంతో త‌గ్గుతున్న‌ స‌గ‌టు ఆయుర్ధాయం!

కాలుష్యంతో త‌గ్గుతున్న‌ స‌గ‌టు ఆయుర్ధాయం!

న్యూఢిల్లీ: ‌కాలుష్యం కార‌ణంగా భారతీయుల స‌గ‌టు ఆయుర్ధాయం త‌గ్గిపోతున్న‌ద‌ని తాజాగా ఓ నివేదిక‌లో వెల్ల‌డైంది. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా భారతీయుల సగటు ఆయుర్దాయం 5.2 ఏండ్లు తగ్గిపోతున్న‌ద‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో కాలుష్యాన్ని కనుక తగ్గించగలిగితే ఆయుర్దాయం మరో 9.4 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని తాజాగా నివేదిక‌ అంచనావేసింది. 

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. పీఎం 2.5 (కాలుష్య కారమైన రేణువులు) క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రాన్లకు మించకూడదు. అలాగే, పీఎం10 క్యూబిక్ మీటరుకు 20 మైక్రాన్లకు మించకూడదు. అయితే, 2018లో ఇండియాలో సగటున పీఎం 2.5 క్యూబిక్ మీటరుకు 63 మైక్రాన్లుగా నమోదైంది. చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సరికొత్త విశ్లేషణ ప్రకారం.. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలో కాలుష్యాన్ని తగ్గించినట్టయితే మొత్తం భారతీయుల ఆయుర్దాయం పెరుగుతుందని గుర్తించారు. 

'పరమాణు కాలుష్యం క్రమంగా పెరిగింది. 1998 నుంచి సగటు వార్షిక పరమాణు కాలుష్యం 42 శాతం ఉంది. ఆ సంవత్సరాల్లో సగటు నివాసి జీవితకాలాన్ని 1.8 సంవత్సరాలు తగ్గిస్తుంది' అని నివేదిక వివరించింది. భారతదేశ జనాభాలో నాలుగింట ఒకవంతు మంది మరే దేశంలోనూ కనిపించని కాలుష్య స్థాయికి గురవుతున్నారని, కాలుష్య స్థాయులు ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశంలో 248 మిలియన్ల మంది 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుర్దాయాన్ని కోల్పోతారని విశ్లేషించారు. 

డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన మార్గదర్శకాల కంటే లక్నోలో కాలుష్యం 11 రెట్లు అధికంగా ఉందని, ఇది ఇలాగే కొనసాగితే లక్నోవాసులు 10.3 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతారని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించగలిగితే అక్కడి వారి జీవిత కాలానికి మరో 9.4 ఏళ్లు కలుస్తుందని, అదే భారతదేశ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించగలితే 6.5 సంవత్సరాలు కలుస్తుందని నివేదిక వివరించింది. 

దేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు మించిన వార్షిక సగటు పరమాణు కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 84 శాతం మంది భారతదేశ సొంత గాలి నాణ్యత ప్రమాణాలకు మించిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo