ఆదివారం 17 జనవరి 2021
National - May 07, 2020 , 02:50:54

హిజ్బుల్‌ అధిపతి హతం

హిజ్బుల్‌ అధిపతి హతం

  • ఎనిమిదేండ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నైకూ 
  • బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత హిజ్బుల్‌ బాధ్యతల స్వీకరణ

శ్రీనగర్‌, మే 6: కర్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌సహా ఎనిమిది మంది భద్రతా బలగాలను చంపిన ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. కరుడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ, మరో ముగ్గురు ఉగ్రవాదులను బుధవారం హతమార్చింది. పుల్వామా జిల్లాలోని తన స్వగ్రామానికి మంగళవారం నైకూ వచ్చినట్లు సమాచారం అందుకున్న బలగాలు రాత్రి వేళ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. నైకూ ఆచూకీ కోసం బేగ్‌పొరా ప్రాంతంలో తీవ్రంగా గాలించాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన నైకూ, అతడి అనుచరుడు బలగాల రాకను గుర్తించి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాసేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చిన నైకూ కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో నైకూ హతమయ్యాడు. అనంతరం అతడి అనుచరుడిని కూడా మట్టుబెట్టారు. కాగా నైకూ గతంలో పలుసార్లు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. బలగాలకు చిక్కకుండా ఎనిమిదేండ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి తలపై రూ.12 లక్షల రివార్డు కూడా ఉన్నది. ఉగ్రవాది బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత హిజ్బుల్‌ బాధ్యతలను (చీఫ్‌ హోదాలో) నైకూనే చూస్తున్నాడు. మరోవైపు పుల్వామా జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా లోయ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. ఇంకోవైపు రియాజ్‌ నైకూను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయంగా చెప్పవచ్చు. అతడు హతమైన నేపథ్యంలో కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా తగ్గుతాయి. 

ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఉగ్రవాదం వైపు..

  • రియాజ్‌ నైకూ (35) కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. స్థానిక పాఠశాలలో మ్యాథమెటిక్స్‌ ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై 2012 లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ సంస్థ మాజీ టాప్‌ కమాండర్‌, 2016లో భద్రతా బలగాల చేతుల్లో హతమైన బుర్హన్‌ వనీకి, నైకూకు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇతడు కూడా బుర్హన్‌ వనీలాగే మంచి సాంకేతిక పరిజ్ఞానం కలవాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం, యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేసేవాడు. దీంతో తక్కువ కాలంలోనే హిజ్బుల్‌లో టాప్‌ కమాండర్‌ స్థాయికి ఎదిగాడు. 
  • నైకూ గతంలో పలుసార్లు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. అయితే అతడి పేరు 2016లో వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాది షారిఖ్‌ అహ్మద్‌ భట్‌ హతమైన తర్వాత అతడి అంత్యక్రియల్లో నైకూ పాల్గొన్నాడు. తుపాకీ ధరించిన నైకూ గాలిలోకి కాల్పులు జరుపడంతో భద్రతా బలగాలు అతడిపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో పలుసార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు నైకూ. అతడిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు పలు ప్రయత్నాలు చేశాయి. చివరికి అతడి ప్రేయసి ద్వారా పట్టుకుందామని ప్రయత్నించి విఫలమయ్యాయి. ఈ విషయాలు గుర్తించిన నైకూ పోలీసుల ముందు లొంగిపోతానని 2018లో ప్రకటించాడు. కానీ లొంగిపోలేదు.
  • రియాజ్‌ నైకూ స్థానికుడు కావడంతో కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపునకు సులువుగా మళ్లించాడు. ఎంతో మంది యువతను ఉగ్రవాదులుగా తయారుచేశాడు. చివరికి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యాడు.