బుధవారం 27 జనవరి 2021
National - Jan 09, 2021 , 17:54:54

‘చైనాలో చిక్కుకున్న నావికులు వారంలో తిరిగొస్తారు..’

‘చైనాలో చిక్కుకున్న నావికులు వారంలో తిరిగొస్తారు..’

న్యూఢిల్లీ: చైనాలో చిక్కుకున్న 39 మంది భారత నావికులు వారం రోజుల్లో తిరిగి వస్తారని కేంద్ర ఓడ రేవులు, జలరవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ‘చైనాలో చిక్కుకున్న మన నౌకాలు తిరిగి భారత్‌కు వస్తున్నాయి. 23 మంది భారతీయ సిబ్బంది కలిగిన రవాణా నౌక ఎంవి జగ్ ఆనంద్, జపాన్‌లోని చిబాకు ప్రయాణమవుతున్నది. అందులోని సిబ్బంది మార్పిడి జరుగుతుంది. అనంతరం వారు అక్కడి నుంచి బయలుదేరి ఈ నెల 14న భారత్‌కు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది’ అని ట్విట్టర్‌లో తెలిపారు. కీలకమైన సమయంలో నావికులకు అండగా నిలబడి, మానవీయ సహాయాన్ని అందించిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ కృషిని అభినందిస్తున్నట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

భారతీయ బల్క్ కార్గో నౌక ఎంవి జగ్ ఆనంద్ జూన్ 13 నుండి చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని జింగ్‌టాంగ్ ఓడరేవు సమీపంలో నిలిచి ఉన్నది. ఇందులో 23 మంది భారతీయ నావికులున్నారు. మరో రవాణా నౌక ఎంవి అనస్తాసియా సెప్టెంబర్ 20 నుండి చైనాలోని కాఫీడియన్ ఓడరేవు సమీపంలో నిలిచి ఉన్నది. ఇందులో 16 మంది భారతీయ నావికులున్నారు. కరోనా సాకుతో కొన్ని నెలలుగా చైనా సముద్ర జలాల్లో నిలువరించిన ఈ రెండు కార్గో నౌకల్లో 39 మంది భారతీయ నావికా సిబ్బంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఇటీవల తెలిపారు. వారిని భారత్‌ రప్పించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వివరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo