సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:00:36

ఈశాన్య రాష్ట్రాల రాజ‌ధానుల‌కు రైల్వే క‌నెక్టివిటీ

ఈశాన్య రాష్ట్రాల రాజ‌ధానుల‌కు రైల్వే క‌నెక్టివిటీ

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నింటినీ 2023 నాటికి రైల్వే నెట్‌వ‌ర్క్‌కు అనుసంధానం చేసేందుకు భార‌తీయ రైల్వేలు కృషి చేస్తున్నాయ‌ని రైల్వే బోర్డు చైర్మ‌న్ వినోద్‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. మీడియాతో వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నింటినీ అనుసంధానించే ప్రాజెక్టును అమలు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం సిక్కిం మిన‌హా అన్ని ఈశాన్య రాష్ట్రాలు రైల్వే నెట్‌వ‌ర్క్‌తో అనుసంధాన‌మై ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అన్ని ఈస్ట్ స్టేట్స్ క్యాపిట‌ల్ సిటీల‌ను క‌లిపే ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. ఇప్పటికే అస్సాం, త్రిపుర, అరుణాచల్ రాజధానులు అనుసంధానమై ఉన్నాయి. 

మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో ప‌నులు పురోగతిలో ఉన్నాయ‌ని, ఈ మేర‌కు ల‌క్ష్యం నిర్దేశించామ‌ని చెప్పారు. మార్చి 2022లో మణిపూర్ కనెక్ట్ చేయబడుతుంద‌ని, మిజోరాం 2023 మార్చిలో, నాగాలాండ్ మార్చి 2023లో, మార్చి 2022లో మేఘాలయ, డిసెంబర్ 2022లో సిక్కిం కనెక్ట్ చేయ‌నున్న‌ట్లు చైర్మ‌న్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలా పనులు జరిగాయ‌ని, రాబోయే మూడేళ్ల‌లో చాలా ప‌నులు వేగ‌వంతంగా సాగుతున్నాయ‌ని, 2023 నాటికి అనుసంధాన ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు. ఇవి రైల్వేకు ముఖ్య‌మైన ప్రాజెక్టుల‌ని, వీటిపై ఐదేళ్ల సంవ‌త్స‌రాల నుంచి దృష్టి సారించామ‌ని చెప్పారు.


logo