శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 21:38:53

శ్రామిక్‌ రైళ్లు నడిపి 360 కోట్ల లాభాలు ఆర్జించిన రైల్వేలు

శ్రామిక్‌ రైళ్లు నడిపి 360 కోట్ల లాభాలు ఆర్జించిన రైల్వేలు

ముంబై : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి నడుస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లు 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 రైళ్లు నడపగా.. రూ.360 కోట్లు అద్దెగా సంపాదించింది. ఈ కాలంలో తలసరి అద్దె సగటు రూ.600 గా రైల్వే శాఖ పేర్కొన్నది. 

రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. శ్రామిక్‌ స్పెషల్ రైలును నడపడానికి సుమారు రూ.80 లక్షల ఖర్చు అవుతుందని,  రైల్వేలు 85 శాతం ఖర్చులను భరిస్తుండగా, ఆయా రాష్ట్రాలు 15 శాతం భరిస్తున్నాయని చెప్పారు. ఈ శ్రామిక్‌ రైళ్లకు సగటు ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడికి రూ.600 వసూలు చేశారని, ఇది మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలుకు సాధారణ ఛార్జీ అని, ప్రత్యేక రైలు దాని కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అన్నారు. ఈ రైళ్ల ద్వారా 60 లక్షల మందిని వారి గమ్యస్థానానికి రవాణా చేసామని వెల్లడించారు. జూన్ 3 వరకు వారి అవసరాలకు అనుగుణంగా రైళ్ల డిమాండ్ గురించి వివిధ రాష్ట్రాలను అడిగామని, 171 మంది కార్మికుల ప్రత్యేక రైళ్లను అందించాల్సింది కోరినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, జూన్ 14 న అదనపు రైళ్ల డిమాండ్ గురించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలను అడిగామని, రాష్ట్రాల డిమాండ్ కొనసాగుతున్నంతవరకు రైళ్లను నడుపుతూనే ఉంటామని పేర్కొన్నారు. జూన్, జూలై నెలల్లో ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండదని చెప్పారు.

ఈ శ్రామిక్‌ స్పెషల్ రైళ్లు పనిచేయడం ప్రారంభించినప్పుడు.. వలస కూలీల నుంచి రైల్వే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఆరోపించాయి. దీని తరువాత టికెట్ మొత్తంలో 15 శాతం సంబంధిత రాష్ట్రం నుంచి తీసుకొంటున్నామని, రైల్వే 85 శాతం మొత్తాన్ని భరిస్తున్నదని స్పష్టం చేసింది.


logo