గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 10:25:19

ఫ్రాన్స్ మంచు కొండ‌ల్లో దొరికిన 1966 నాటి భార‌తీయ వార్తాప‌త్రిక‌లు

ఫ్రాన్స్ మంచు కొండ‌ల్లో దొరికిన 1966 నాటి భార‌తీయ వార్తాప‌త్రిక‌లు

హైద‌రాబాద్‌: 1966 సంవ‌త్స‌రానికి చెందిన వార్తాప‌త్రికలు‌.. ఫ్రాన్స్‌లోని మౌంట్ బ్లాంక్‌ ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉన్న గ్లేసియ‌ర్స్‌లో క‌నిపించాయి.  నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక ఆ మంచు కొండ‌ల్లో సుమారు 54 ఏళ్ల త‌ర్వాత ప్ర‌త్య‌క్ష‌మైంది.  భార‌త తొలి మ‌హిళా ప్ర‌ధాని అన్న శీర్షిక ఆ ప‌త్రిక‌లో ఉన్న‌ది.  1966లో ఇందిరాగాంధీ .. భార‌త ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు. ఆ నాటి క‌థ‌నానికి చెందిన శీర్షిక‌తో ఉన్న దిన‌ప‌త్రిక కాపీను గ్లేసియ‌ర్స్‌లో క‌నిపించ‌డం విడ్డూర‌మే.  1966, జ‌న‌వ‌రి 24వ తేదీన మౌంట్ బ్లాంక్ కొండ‌ల్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 707 విమానం కూలింది. ఈ ప్ర‌మాదంలో 177 మంది మ‌ర‌ణించారు.  

యూరోప్‌లో ఉన్న అత్యంత ఎత్తైన ప‌ర్వతాల్లో కూలిన ఆ విమాన ప్ర‌యాణికుల‌కు ఈ ప‌త్రిక చెంది ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సుమారు 1350 మీట‌ర్ల ఎత్తులో ఫ్రెంచ్ రిసార్ట్‌ న‌డుపుతున్న టిమోతి మోటిన్ అనే వ్య‌క్తికి ఈ ప‌త్రిక ఆన‌వాళ్లు దొరికాయి.  ఆ కాలం నాటి ప‌త్రిక ఇప్పుడు కూడా చ‌దివే రీతిలో ఉన్న‌ట్లు మోటిన్ ఓ మీడియాతో తెలిపారు. ఇదో అరుదైన సంద‌ర్భ‌మ‌ని, ప్ర‌తి సారీ మిత్రుల‌తో క‌లిసి మంచు కొండ‌ల‌పై న‌డుస్తుంటే, ఎదో ఒక‌టి దొరుకుతుంద‌ని, మంచు కొండ‌ల్లో ప్ర‌మాదాల‌కు సంబంధించిన జ్ఞాప‌కాలు ఏవో ఒక‌టి మిగిలి ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు.  

నేష‌న‌ల్ హెరాల్డ్‌, ఎక‌నామిక్ టైమ్స్ ప‌త్రిక‌ల‌కు చెందిన కాపీల‌ను ఆ ప‌ర్వ‌తాల్లో గుర్తించారు. బోస‌న్స్ గ్లేసియ‌ర్‌లో అల‌నాటి ప‌త్రిక‌ల ఆన‌వాళ్లను సేక‌రించారు.  దాదాపు ఆరు ద‌శాబ్ధాల క్రితం ఐస్‌లో ప‌త్రిక‌లు ఇరుక్కుపోయినట్లు మోటిన్ అన్నాడు. ఇప్పుడిప్పుడు ఆ మంచు క‌ర‌గ‌డం వ‌ల్ల ఆ ప‌త్రిక‌లు క‌నిపించిన‌ట్లు అత‌ను చెప్పాడు.  ఆ విమాన ప్ర‌మాదానికి సంబంధించిన శిథిలాలు ఇప్ప‌టికీ దొరుకుతుంటాయ‌ని, వాటిని త‌న కేఫ్‌లో భ‌ద్ర‌ప‌రుస్తున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు. 2012 నుంచి మంచు క‌రుగుతోన్న‌ద‌ని, అప్ప‌టి నుంచి అత‌నికి విమాన శిథిలాల‌కు చెందిన ఆన‌వాళ్లు ల‌భిస్తూనే ఉంటాయ‌న్నాడు.  
logo