ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 14:53:38

బిఎస్6 మోటార్‌సైకిళ్లు విడుదల మరింత ఆలస్యం ?

బిఎస్6 మోటార్‌సైకిళ్లు విడుదల మరింత ఆలస్యం ?

ముంబై : కరోనా మహమ్మారి నేపథ్యంలో  మిగిలిన రంగాలతో పోలిస్తే ఆటోమొబైల్ రంగం మరింతగా డీలా పడింది. దీనికి తోడు బిఎస్6 ఇండియన్ మోటార్‌సైకిళ్లు విడుదల మరింత ఆలస్యం కానుండడంతో ఇంకొన్నాళ్లు నష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' భారత మార్కెట్లో విక్రయిస్తున్న మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ఇప్పట్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపించడం లేదు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా, ఈ ఏడాది చివరికి మాత్రమే బిఎస్6 వాహనాలను భారత్‌లోకి తీసుకురాగలమని కంపెనీ పేర్కొంది. దేశంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి తయారీదారులు భారత్‌లో బిఎస్4 వాహనాల విక్రయాలను నిలిపివేయాల్సి ఉంది.

కానీ, ఇండియన్ బ్రాండ్ మాత్రం గడువు పూర్తయినా కూడా ఇప్పటికీ బిఎస్6 కంప్లైంట్ మోటార్‌సైకిళ్ళను మార్కెట్లో ప్రవేశపెట్టలేదు. ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిని బట్టి తాము గడువును నిర్ణయించలేమని పొలారిస్ యాజమాన్యంలో ఉన్న అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రపంచ అనిశ్చితి వలన ఈ మోడళ్ల విడుదల సంబంధించిన నిర్ధిష్ట కాలపరిమితిని నిర్వచించడం చాలా కష్టమని పొలారిస్ ఇండియా హెడ్ లలిత్ శర్మ చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మోటార్‌సైకిళ్లలో ముందుగా రానున్న బిఎస్6 బైక్‌లలో ఇండియన్ స్కౌట్ శ్రేణి మొదటి మోడల్‌గా నిలువనున్నట్లు తెలుస్తున్నది.

ఈ బ్రాండ్ ప్రస్తుతం భారతదేశంలో తమ స్కౌట్, ఎఫ్‌టిఆర్, చీఫ్ మరియు చీఫ్టైన్ శ్రేణి మోటార్‌సైకిళ్లను విక్రయిస్తుంది. ఈ వాహనాలన్నీ వి-ట్విన్ ఇంజన్‌లను కలిగి ఉంటాయి. ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో ఒక సముచితమైన బ్రాండ్. దేశీయవి విపణిలో ఈ బ్రాండ్ విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లన్నింటినీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తారు. అధిక దిగుమతి సుంఖాల కారణంగా వీటి రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.

భారత మార్కెట్లో బిఎస్6 ఇండియన్ మోటార్‌సైకిళ్లు విడుదల ఆలస్యం కావటానికి ప్రధాన కారణం, ఈ మోడళ్లు పూర్తిగా అమెరికాలో తయారు కావటమే. సాధారణంగా వీటిని అక్కడి మార్కెట్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోవటానికి చాలా సమయం పడుతుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నకరోనా భయాందోళనల  నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల మద్య కూడా జాప్యం జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే 2021 మొదటి త్రైమాసికంలో ఇండియన్ మోటార్‌సైకిల్ బిఎస్6 మోడళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.logo