శనివారం 28 మార్చి 2020
National - Mar 01, 2020 , 02:34:45

బ్రిటన్‌లో భారతీయుడికి జైలు

బ్రిటన్‌లో భారతీయుడికి జైలు
  • విదేశీయులతో కలిసి రూ. 93 కోట్ల ఆన్‌లైన్‌ మోసాలు

లండన్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడిన ఓ భారతీయుడితో సహా మొత్తం ఐదుగురికి బ్రిటన్‌ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. దాదాపు రూ.93 కోట్ల (కోటి పౌండ్లు) చెల్లింపులను పక్కదారి పట్టించి ఆన్‌లైన్‌ కుంభకోణానికి తెరలేపిన 44 ఏండ్ల సతీశ్‌ కోటినాథునితో పాటు ముగ్గురు నైజీరియన్లు, జర్మనీకి చెందిన మరో వ్యక్తిని దోషులుగా తేలుస్తూ లండన్‌లోని సౌత్‌వార్క్‌ క్రోన్‌ కోర్టు శుక్రవారం ఈ శిక్ష విధించింది. నేరపూరిత కేసుల్లోని ఆస్తులను మార్చి వాటిని కాజేసేందుకు కుట్ర పన్నినందుకుగాను తెలుగు వ్యక్తిగా అనుమానిస్తున్న సతీశ్‌ను గతేడాది జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో.. తప్పుడు పత్రాలతో మోసానికి కుట్ర చేసినందుకు ఐదేండ్లు, నేరపూరిత ఆస్తిని మార్చడానికి చేసిన కుట్రకు మరో ఆరేండ్లు జైలు శిక్ష విధిస్తూ లండన్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని స్పష్టంచేసింది. ‘మోసానికి పాల్పడే సమయంలో వందలాది బ్యాంకు ఖాతాలను సతీశ్‌ సేకరించాడు’ అని మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. 2014- 2019 మధ్య 235 వేర్వేరు మోసాలకు పాల్పడ్డాడని.. ఆ మోసాల విలువ రూ. 92,53,91,762 ఉంటుందని పేర్కొన్నారు.


logo