శుక్రవారం 10 జూలై 2020
National - Jun 16, 2020 , 14:49:26

ఫైరింగ్ జ‌ర‌గ‌లేదు.. రాళ్లు రువ్వుకున్నారు.. లాఠీల‌తో కొట్టుకున్నారు

ఫైరింగ్ జ‌ర‌గ‌లేదు.. రాళ్లు రువ్వుకున్నారు.. లాఠీల‌తో కొట్టుకున్నారు

హైద‌రాబాద్‌: చైనా స‌రిహ‌ద్దుతో ఉన్న‌ వాస్త‌వాధీన రేఖ‌.. ఇప్పుడు నియంత్ర‌ణ రేఖ‌గా మారుతోంది.  సోమ‌వారం రాత్రి ల‌డ‌ఖ్ స‌మీపంలో భార‌త‌, చైనా బ‌ల‌గాల‌కు చెందిన సైనికులు తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇప్ప‌టికే ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇప్పుడు మ‌రింత జ‌ఠిలంగా మారాయి.  రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఎటువంటి కాల్పుల ఘ‌ట‌న జ‌ర‌గ‌లేదు. కానీ ఇరు దేశాల జ‌వాన్లు మాత్రం నేరుగా బాహాబాహీకి దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. లాఠీల‌తో చెల‌రేగిపోయారు.  ఈ ఘ‌ట‌న‌లో భార‌త సైన్యానికి చెందిన క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందిన‌ట్లు ఆర్మీ ప్ర‌క‌టించింది. కాల్పులు జ‌ర‌గ‌కున్నా.. ముష్టిఘాతం భీక‌రంగా సాగిన‌ట్లు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు.  

ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి చైనా కూడా ప్ర‌క‌ట‌న చేసింది.  చాలా భీక‌ర స్థాయిలో ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ట్లు చైనా పేర్కొన్న‌ది. స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చిన భార‌త బ‌ల‌గాలు.. త‌మ సైనికుల‌పై దాడి చేసిన‌ట్లు చైనా పేర్కొన్న‌ది.  దీనిపై విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి జావో లిజియాన్ స్పందించారు. భార‌త బ‌ల‌గాలు రెండుసార్లు స‌రిహ‌ద్దు దాటిన‌ట్లు చైనా ఆరోపించింది. చైనా బ‌ల‌గాల‌ను భార‌త ద‌ళాలు రెచ్చ‌గొట్టిన‌ట్లు జావో తెలిపారు. దీంతో రెండు దేశాల మ‌ధ్య  గాల్వ‌న్ వ్యాలీలో ర‌క్తం చిందింది.  

మే నెల నుంచి రెండు దేశాల దళాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మే 9వ తేదీన జ‌రిగిన దాడిలో రెండు దేశాల‌కు చెందిన సైనికులు గాయ‌ప‌డ్డారు.  మిలిట‌రీ, దౌత్య చ‌ర్య‌ల‌తో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు చెక్ పెట్టిన‌ట్లు గ‌త వార‌మే చైనా ప్ర‌క‌టించింది. కానీ సోమ‌వారం మ‌ళ్లీ రెండు దేశాల ద‌ళాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. మ‌రోవైపు గాల్వ‌న్ వ్యాలీలోనే ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు రెండు దేశాల సైనికాధికారులు చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. 
logo