శుక్రవారం 10 జూలై 2020
National - Jun 17, 2020 , 00:33:06

వీరమరణం పొందిన 20 మంది భారతీయ సైనికులు

వీరమరణం పొందిన 20 మంది భారతీయ సైనికులు

ఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారితో సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందినట్లు ఆర్మీ అధికారులు దృవీకరించారు. ఈ ఘటనలో 17 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘర్షణలో చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించి ఉండవచ్చని తెలిసింది. అయితే చైనా సైనికులు 10 మంది మృతి చెందినట్లు పీటీఐ సమాచారం అందిస్తోంది. 

గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని భారత్‌ - చైనా ప్రకటించాయి. మే 5వ తేదీ నుంచి చిన్నగా ప్రారంభమైన ఈ ఘర్షణ సోమవారం రాత్రి తీవ్రరూపం దాల్చి రెండు దేశాల సైనికులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కొట్లాటలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు. 1975 తరువాత భారత్‌ - చైనా సరిహద్దులో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. సరిహద్దు వద్ద చైనాకు చెందిన హెలికాప్టర్లలో తమ సైనికుల మృతదేహాలను తరలిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు, గాల్వాన్‌లోయ, దౌలత్‌బేగ్‌ ఒలిడి ప్రాంతాల్లో చైనా గస్తీ ఎక్కువ కావడాన్ని గమనించిన భారత సైన్యం అప్రమత్తమైంది. 


logo