సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 03:14:23

సైన్యంలో తొలి కేసు

సైన్యంలో తొలి కేసు

  • లడఖ్‌లో ఒక జవాన్‌కు కరోనా పాజిటవ్‌
  • దేశంలో 158కి చేరిన బాధితులు

న్యూఢిల్లీ: భారత సైన్యంలో తొలి కరోనా కేసు నమోదైంది. లడఖ్‌ స్కౌట్‌ రెజిమెంట్‌కు చెందిన 34 ఏండ్ల జవాన్‌కు వైరస్‌ సోకినట్లు సైన్యం ధ్రువీకరించింది. ఇరాన్‌ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రిని కలువడంతో ఆ సైనికుడికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. జవాను తండ్రి ఎయిరిండియా విమానం ద్వారా గత నెల 20న భారత్‌కు తిరిగివచ్చినట్లు చెప్పారు. జవాన్‌ సోదరుడికీ కరోనా సోకినట్లు తేలిందన్నారు. జవానుకు కరోనా సోకిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై నిఘా పెంచింది. వార్‌గేమ్స్‌, రిక్రూట్‌మెంట్‌, శిక్షణ కార్యక్రమాలను రద్దు చేసింది.  పుణేలోని ‘కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజనీరింగ్‌'కు చెందిన ఆర్మీ అధికారికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆయనను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా నియంత్రణపై కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు క్వారంటైన్‌లను సందర్శించి, అక్కడి వసతులను పర్యవేక్షించాలని ఆదేశించారు. 

మహారాష్ట్రలో విజృంభణ

బుధవారం మరో 21 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో దేశంలో బాధితుల సంఖ్య 158కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 25 మంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు. బాధితులతో సన్నిహితంగా మెలిగిన దాదాపు 5,700 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో మరో ఏడు ల్యాబ్‌లు ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌదీ అరేబియా నుంచి ఇటీవల తిరిగి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

రెస్టారెంట్లు మూసేయండి!

వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నెల 31 వరకు లేదా రెస్టారెంట్లను మూసివేయాలని ‘నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేన్‌' తమ సభ్యులను కోరింది. కర్ణాటకలో విద్యాసంస్థలు, ధియేటర్లు, మాల్స్‌పై ఆంక్షలను ఈ నెల 31 వరకు పొడిగించారు.


logo